ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మెదక్ నిమ్జ్! | Sakshi
Sakshi News home page

ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మెదక్ నిమ్జ్!

Published Fri, Jul 15 2016 3:15 AM

ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మెదక్ నిమ్జ్!

* టీఎస్‌ఐఐసీకి అనుబంధంగా ఏర్పాటు
* పారిశ్రామిక పార్కు అభివృద్ధి బాధ్యత నూతన కంపెనీకి..
* 18 నెలల్లో 12,635 ఎకరాలు నూతన కంపెనీకి బదిలీ

సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన నేపథ్యంలో... భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మౌలిక వసతుల కల్పన, ప్లాట్ల కేటాయింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికిల్)ను ఏర్పాటు చేసింది.

రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ)కి అనుబంధంగా మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్ పేరిట ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా ఏర్పాటైనా.. మాతృసంస్థ టీఎస్‌ఐఐసీ వంద శాతం ప్రభుత్వ సంస్థ కావడంతో నూతన కంపెనీ కార్యకలాపాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి.
 
భూమి అప్పగింతకు సన్నాహాలు
నిమ్జ్ ఏర్పాటుకు మెదక్ జిల్లా జహీరాబాద్, న్యాలకల్ మండలాల్లో 12,635 ఎకరాలను గుర్తించారు. మూడు దశల్లో 18 నెలల వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలని... తొలి దశలో కనీసం మూడు వేల ఎకరాలు అప్పగిస్తేనే నిమ్జ్ హోదా దక్కుతుందని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహక విభాగం (డిప్) స్పష్టీకరించింది. మొత్తం భూసేకరణకు రూ.2,450 కోట్లు అవసరమని అంచనా వేయగా.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్ల మేర విడుదల చేసింది. తొలి విడతకు సంబంధించి మూడు వేల ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో... దానిని మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్‌కు అప్పగించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.
 
ఇక పనులు వేగవంతం
రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సౌకర్యాల కల్పన, నిర్వహణ తదితరాలు టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతాయి. కానీ నిమ్జ్ వంటి భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి సవాలుతో కూడుకున్నది కావడంతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని డిప్ షరతు విధించింది. ఈ మేరకు ‘మెదక్ నిమ్జ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి టీఎస్‌ఐఐసీకి భూ బదిలీ జరిగిన వెంటనే పార్కు అభివృద్ధికి సంబంధించిన సంపూర్ణ నివేదిక తయారీ, పర్యావరణ అనుమతులు, లే ఔట్ రూపకల్పన,  కాంట్రాక్టు సంస్థల ఎంపిక తదితర కార్యకలాపాలన్నీ మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతాయి. అయితే పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు టీఎస్‌ఐఐసీ అధికారులనే కేటాయిస్తారా, లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
 
ఎన్నో ప్రయోజనాలు
నిమ్జ్ హోదా దక్కే పారిశ్రామిక వాడలకు కేంద్రం భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఆ పారిశ్రామిక వాడకు ప్రధాన మార్గాలతో అనుసంధానం, మౌలిక సౌకర్యాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్రం వంద శాతం గ్రాంటు రూపంలో అందిస్తుంది. దీంతోపాటు అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. మెదక్ నిమ్జ్‌ను ఉదాహరణగా తీసుకుంటే మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3వేల కోట్లు గ్రాంటు రూపంలో, అందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రూ.4వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు, రాయితీ రూపంలో అందే వీలుంది. ఈ నిమ్జ్‌తో 2022 నాటికి సుమారు రూ.40వేల కోట్ల పెట్టుబడులతో మూడు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. కేంద్ర నిబంధనల మేరకు ఏదైనా పారిశ్రామిక వాడకు నిమ్జ్ హోదా దక్కాలంటే 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా 5 వేల హెక్టార్ల (సుమారు 12,500 ఎకరాల) స్థలం ఉండాలి.

Advertisement
 
Advertisement