కుమార్తెతో కలిసి గర్భిణి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కుమార్తెతో కలిసి గర్భిణి ఆత్మహత్య

Published Sun, Jul 24 2016 10:48 AM

కుమార్తెతో కలిసి గర్భిణి ఆత్మహత్య

వరకట్న వేధింపులే కారణమంటున్న మృతురాలి బంధువులు

కోవూరు: తన మూడేళ్ల కుమార్తెతో కలిసి నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కోవూరులోని కోనమ్మతోటలో శనివారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం మేరకు.. కొడవలూరు మండలం రామన్నపాళెంకు చెందిన చెంతాటి వెంకటరమణయ్య, సుధామణి దంపతుల కుమార్తె  అనుచందన (20)కు కోవూరు కోనమ్మతోటక చెందిన జ్యోతి శంకర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఆ సమయంలో రూ.3 లక్షల నగదు, 30 సవర్ల బంగారంతో పాటు రెండు కేజీల వెండి వస్తువులను కట్నంగా అందజేశారు.  అదనంగా రూ.80 వేల విలువ చేసే బైక్‌ను కానుకగా కొనిచ్చారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి మూడేళ్ల రుషిక అనే కుమార్తె ఉంది. సుధామణి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం ఆమె వివాహానికి ముందే నుంచే హైదరాబ్‌లోని మల్కాజ్‌గిరికి వలస వెళ్లారు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి అయిన అనుచందన తన కుమార్తె రుషికతో కలిసి నెల క్రితం హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.

శంకర్‌ మాత్రం కోవూరులోనే తల్లిదండ్రుల వద్ద ఉన్నాడు. అనుచందన, ఆమె తల్లి సుధామణి, కుమార్తె రుషికతో కలిసి   శనివారం ఉదయం కోవూరుకు చేరుకున్నారు. కుమార్తెను అనుచందన, మనుమరాలు రుషికను కోవూరు అత్తారింట్లో వదిలిపెట్టి సుధామణి రామన్నపాళెంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటికే ఏమైందో ఏమో తెలియదు కానీ సుధామణి మార్గం మధ్యలో ఉండగానే అనుచందన, రుషిక ఉరేసుకుని చనిపోయారని శంకర్‌ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో సుధామణి గుండెలు అదిరేలా రోదిస్తూ తిరిగి కుమార్తె ఇంటికి పరిగెత్తింది.అనుచందన రుషికను తన బెడ్‌రూంలోకి తీసుకెళ్లి ఉరివేయడంతో పాటు తాను ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్నారు. ఎంత సేపటికి గడి తీయకపోవడంతో శంకర్‌ కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి తలుపులు పగలుగొట్టారు. విగతజీవులుగా తల్లికుమార్తెలను చూసి గెండెలు పగిలేలా రోదించారు.
 
డబ్బులు ఇస్తేనే ఫోన్‌లో మట్లాడించేవాడు..
తల్లిబిడ్డ మృతి వివరాలను తెలుసుకున్న సుధామణి బంధువులు రామన్నపాళెం నుంచి కోవూరుకు చేరుకున్నారు. శంకర్‌తో పాటు కుటుంబ సభ్యులే తల్లి, బిడ్డ ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అనుచందన భర్త శంకర్‌ అడిగినప్పుడు డబ్బులు ఇస్తేనే హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడించే వాడని, లేకుంటే ఆ అవకాశమే లేకుండా చేసేవాడని బంధువులు దుమ్మెత్తి పోశారు. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి సెంటర్‌ వంద గజాల స్థలం ఉందని, దాన్ని అమ్మి తనకు డబ్బులు ఇవ్వాలని నిత్యం వేధించేవాడు. ప్రస్తుతం స్థలం ధర ఎక్కువ లేదని మంచి రేటు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పిన వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
అమ్మమ్మ నీతో వస్తాను..
హైదరాబాద్‌ నుంచి తమతో పాటు సింగరాయకొండకు వస్తున్న అనుచందన పెద్దమ్మ  శైలజతో తాను నీతో వస్తానని చిన్నారి రుషిక అల్లరి చేసింది. ఆ సమయంలో అనుచందన రుషికను లాలించి బుజ్జగించి కోవూరు తీసుకువచ్చిందని శైలజ చేసిన రోదన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement