ఆ ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గర.. ప్రజలకు దూరం | pcc chief raghuveera reddy slams cm chandrababu and pm narendra modi over AP issues | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గర.. ప్రజలకు దూరం

Mar 1 2016 8:24 PM | Updated on Aug 21 2018 8:34 PM

ఆ ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గర.. ప్రజలకు దూరం - Sakshi

ఆ ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గర.. ప్రజలకు దూరం

గెలిచిన పార్టీ నుంచి వెళ్లిపోయిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గరవుతూ.. ప్రజలకు దూరం అవుతున్నారన్న రఘువీరారెడ్డి.

- పచ్చ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలపై రఘువీరా వ్యాఖ్య
- మోదీ, బాబులది దగా జోడి.. ఏపీ ప్రయోజనాలకోసం కేంద్రంతో పోరాడతాం
- త్వరలో కార్యాచరణ వెల్లడిస్తామన్న ఏపీసీసీ చీఫ్

 

విజయవాడ సెంట్రల్: '2018లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డప్పు కొట్టుకుంటున్నారు. నిర్మాణానికి రూ.30 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనావేసిన కేంద్రం తీరా కేటాయింపుల దగ్గరకొచ్చేసరికి రూ. 100 కోట్లు మాత్రమే విదిల్చింది. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిందిపోయి సీఎం చంద్రబాబు కళ్లప్పగించి చూస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు భయంతోనే కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు' అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. తమది నంబర్ వన్ జోడీ అని చెప్పుకుంటున్న మోదీ, చంద్రబాబులు నిజానికి దగా జోడి అని ఎద్దేవాచేశారు.

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడిన రఘువీరా.. బాబు, మోదీలు కలిసి రాష్ట్రానికీ తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. రూ. 20 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావన, విభజనచట్టం ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ. 24 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అంశాలను కేంద్రం విస్మరించిందని, ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు బుధవారం తాను ఢిల్లీ వెళుతున్నట్లు రఘువీరా చెప్పారు. అధిష్టానంతో చర్చించిన తర్వాత ఏపీ ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటాలు చేస్తామనేది వెల్లడిస్తామన్నారు.

టీడీపీలోకి ఎమ్మెల్యేల చేరికలపై స్పందిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబుది ఫ్యాక్షన్ మైండ్ అని, ఎన్ని తప్పుడు పనులు చేసినా అడగడానికి ప్రతిపక్షం ఉండకూడదనే ధోరణిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని రఘువీరా అన్నారు. గెలిచిన పార్టీ నుంచి వెళ్లిపోయిన  ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గరవుతూ.. ప్రజలకు దూరం అవుతున్నారని, మెజారిటీ ఉన్నప్పటికీ బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుండటాన్ని జనం ఏవగించుకుంటున్నారని రఘువీరా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement