
నెరవేరనున్న చిరకాల స్వప్నం
ప్రొద్దుటూరు వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. తొలిమారు నంద్యాల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్యాసింజర్‌రైలు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్‌కు చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి కడపకు రైలు వెళుతుంది. జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరుకు ఇంత వరకు రైలు మార్గం లేదు. నిత్యం వ్యాపారులతోపాటు స్థానికులు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్నారు.
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. తొలిమారు నంద్యాల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్యాసింజర్‌రైలు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్‌కు చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి కడపకు రైలు వెళుతుంది. జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరుకు ఇంత వరకు రైలు మార్గం లేదు. నిత్యం వ్యాపారులతోపాటు స్థానికులు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్నారు. గుంతకల్ రైల్వే డివిజన్‌లో అత్యధిక ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్లల్లో ఎర్రగుంట్ల ఒకటిగా ఉండటానికి ప్రధాన కారణం ప్రొద్దుటూరు ప్రాంతం ఉండటమే కారణం. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పించారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, సీఎం చంద్రబాబు నాయుడులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రైలును ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి 5 గంటల ప్రాంతంలో రైలు ప్రొద్దుటూరుకు చేరనుంది. బుధవారం నుంచి యధావిధిగా ప్రతి రోజు నంద్యాల నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మీదుగా కడపకు చేరుతుంది.
ప్రముఖలకు ఆహ్వానం :
నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు స్థానికంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, డాక్టర్ ఎంవి రమణారెడ్డి తదితరులకు ఆహ్వానం అందించారు. వీరంతా మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్‌కు రానున్నారు.
సర్వత్రా హర్షం:
ఎర్రగుంట్ల–నంద్యాల రైలు మార్గం పనులను వేగవంతం చేయాలని గతంలో కూడా పలు మార్లు ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన నేతలతోపాటు ప్రజలు సైతం ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఎట్టకేలకు పట్టణ వాసుల కోరిక నేరవేరతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పైగా ప్రధానంగా ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి వందల మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తుండటం గమనార్హం. ఈ రైలు మార్గం నూతన రాజధాని అమరావతికి ఉండటం విశేషం.