
నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు !
ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం
♦ బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలి
♦ ‘విజిలెన్స్ మానిటరింగ్’లో ఎంపీ కవిత
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని విజి లెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్‌పర్సన్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏళ్ల తరబడిగా వెనుకబడిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేం దుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
కవిత మాట్లాడుతూ పంచాయతీరాజ్‌కు సంబంధించి పనుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నారని అన్నారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి పెనాల్టీ వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బీసీ, ఇతర కాలనీల్లో పనులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యేల నిధులతో కలిపి ప్రభుత్వం నిధులు వినియోగించుకునేలా ప్రయత్నం చేద్దామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే విధంగా చూడాలని ఎంపీ కవిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవా సదుపాయాలు కల్పిస్తున్నామని, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లకు మరొకసారి అవగాహన కల్పించి వైద్యశాఖను మరింత బలోపేతం చేయవల్సి అవసరం ఉందని ఆమె సూచించారు.