
ఐటీఐ పరీక్షల్లో జోరుగా కాపీయింగ్?
జిల్లావ్యాప్తంగా గురువారం ఐటీఐ సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో 11 ప్రభుత్వ, 27 ప్రైవేటు ఐటీఐలకు సంబంధించిన విద్యార్థులు సంబంధిత పరీక్షలు రాశారు.
కడప ఎడ్యుకేషన్:
జిల్లావ్యాప్తంగా గురువారం ఐటీఐ సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో 11 ప్రభుత్వ, 27 ప్రైవేటు ఐటీఐలకు సంబంధించిన విద్యార్థులు సంబంధిత పరీక్షలు రాశారు. వీరికోసం 5 ప్రభుత్వ ఐటీఐలలో, 4 ప్రైవేటు ఐటీఐలతోపాటు పోట్లదుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల, రాజంపేటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 38 ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలకు సంబంధించి 11 సెంటర్లకు గాను 2287 మంది విద్యార్థులు పరీక్షను రాయవలసి ఉండగా 2145 మంది విద్యార్థులు మాత్రమే రాశారు.
కడపలో జోరుగా కాపీయింగ్
కడప రాయచోటి రోడ్డుకు సమీపంలో గల ఓ ఐటీఐలో, అలాగే నగర శివార్లలోని మరో ఐటీఐలో జోరుగా కాపీయింగ్ జరిగినట్లు తెలిసింది. రాయచోటి రోడ్డులోని ఐటీఐలో విద్యార్థులను గుంపులు గుంపులుగా కూర్చోబెట్టి కళాశాల వారే కాపీయింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. దీంతోపాటు పరీక్షలకు వచ్చిన ఇన్విజిలేటర్లే వారికి సహకరించినట్లు తెలిసింది. విద్యార్థులు కూడా మధ్య మధ్యలో బయటకు వచ్చి వారికి కావాల్సిన పనిని కానిచ్చుకుని పోతున్నట్లు ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. కాపీయింగ్ జరిపించేందుకు కళాశాల యాజమాన్యం ప్రతి విద్యార్థి నుంచి రూ.1500లు రెండు వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పరీక్షల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఐటీఐల కన్వీనర్ నాగరాజును వివరణ కోరగా కాపీయింగ్ జరిగినట్లు తమ దృష్టికి రాలేదని, పరిశీలిస్తామని తెలిపారు.
కడపలోని డీఎల్‌టీసీలో నేలబారు పరీక్షలు
కడపలోని డిస్ట్రిక్ లెవెల్ ట్రెయినింగ్ సెంటర్‌లో గురువారం జరిగిన పరీక్షను విద్యార్థులు నేలపైన కూర్చుని రాశారు. సంబంధిత సెంటర్‌లో 140 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. డీఎల్‌టీసీ ఏడీ మంతేషులు పరీక్షను పర్యవేక్షించారు.