చల్లవానిపేట జంక్షన్‌కు సమీపంలోని వంశధార డిగ్రీ కళాశాలలో జరుగుతున్న గీతమ్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్(సీడీఎల్) పరీక్షల్లో
చల్లవానిపేట (జలుమూరు) : చల్లవానిపేట జంక్షన్‌కు సమీపంలోని వంశధార డిగ్రీ కళాశాలలో జరుగుతున్న గీతమ్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్(సీడీఎల్) పరీక్షల్లో విచ్చలవిడిగా చూసి రాతలు సాగుతున్నాయి. డిగ్రీ బీఏ, బీకాం ప్రథమ, తృతీయ సంవత్సరం పరీక్షలు ఈ నెల 10 నుంచి 16వరకు జరగ్గా ఇందులో అక్రమాలతో పాటు ఒకరికి బదులు వేరొకరు పరీక్షలు రాయించారని, సబ్జెక్టుల గైడ్లు పెట్టి మరీ కాపీయింగ్ చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మంగళవారం ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులను తీసుకువచ్చి చూసి రాతలు రాయించారు. పరీక్షలకు హాజరవుతున్న వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.
గైడ్లు పెట్టి చూసిరాతలు రాయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 నుంచి పది వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగానే సబ్జెక్టు పేపరు అభ్యర్థి చేతికి వస్తుందని, గైడ్‌లోజవాబులు వెతికి మరీ చూసి రాసుకుంటున్నారని చెబుతున్నారు. మంగళవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల కంటే సహాయకులే ఎక్కువగా ఉన్నారు. పరీక్షల నిర్వహణ కూడా ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహించారు. దీనిపై ప్రిన్సిపాల్ కె.సూర్యనారాయణ వద్ద సాక్షి ప్రస్తావించగా గీతం యూనివర్సిటీకి సంబంధించి తమ కళాశాలకు స్టడీ కేంద్రం ఉందని, ఇదే కళాశాలలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ కేంద్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
చూసిరాతలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండడంపై అడగ్గా నాకు సంబంధం లేదని పొంతన లేని సమాధానం ఇచ్చారు. కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌గా మెట్ట ఆదినారాయణ వ్యవహరిస్తున్నారని ఆయన్నే అడగండని తప్పించుకున్నారు. ఇదే విషయూన్ని ఆదినారాయణ వద్ద ప్రస్తావించగా రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నానని ఈ రోజే కళాశాలకు వచ్చానని నాకు సంబంధం లేదని చెప్పారు. కళాశాల కరస్పాండెంట్ మధుబాబుతో మాట్లాడండి అని తప్పించుకున్నారు.