 
															బోధనా సామర్థ్యం పెంపుదలే లక్ష్యంగా మరో ‘సంకల్పం’
													 
										
					
					
					
																							
											
						 రాయవరం : గతేడాది లానే ఈ ఏడాది కూడా విద్యాశాఖ ‘సంకల్పం’ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత విద్యా సంవత్సరంలో మార్చి నెలలో తనిఖీలు నిర్వహించి పాఠశాలలకు గ్రేడింగులు ఇవ్వగా.. ఈ విద్యా సంవత్సరంలో అక్టోబరు నెల్లోనే తనిఖీలు నిర్వ
						 
										
					
					
																
	వచ్చే నెల నుంచి పాఠశాలల్లో తనిఖీలు 
	గ్రేడింగులు ఇచ్చేందుకు నిర్ణయం
	రాయవరం : గతేడాది లానే ఈ ఏడాది కూడా విద్యాశాఖ ‘సంకల్పం’ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత విద్యా సంవత్సరంలో మార్చి నెలలో తనిఖీలు నిర్వహించి పాఠశాలలకు గ్రేడింగులు ఇవ్వగా.. ఈ విద్యా సంవత్సరంలో అక్టోబరు నెల్లోనే తనిఖీలు నిర్వహించేందుకు సర్వశిక్షాభియాన్ సన్నద్ధమవుతోంది. ఉపాధ్యాయుల్లో జవాబుదారీ తనాన్ని అమలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తూనే.. వాటిని అభివృద్ధి చేసేందుకు ఎస్‌ఎస్‌ఏ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా పాఠశాలల్లో అమలు చేస్తున్న అంశాలను తనిఖీ బృందాలు పరిశీలించి వాటి ఆధారంగా పాఠశాలలకు గ్రేడింగులు ఇస్తారు. 
	వచ్చే నెలలో తనిఖీలు..
	సర్వశిక్షాభియాన్ అధికారులు సంకల్పం షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దసరా సెలవుల అనంతరం జిల్లాలోని అన్ని మండలాల్లో తనిఖీ బృందాలు పర్యటించి పాఠశాలలను పరిశీలిస్తాయి. ప్రతి మండలంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలు పాఠశాలల తనిఖీ చేపట్టనున్నాయి. ఉదయం అసెంబ్లీ జరిగే సమయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక పాఠశాల, మధ్యాహ్నం నుంచి సాయంత్రం తరగతులు ముగిసే వరకూ మరో పాఠశాలను సందర్శిస్తారు. మూడు నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఆ మండల ఎంఆర్‌సీ కార్యాలయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, తనిఖీలో గుర్తించిన అంశాలపై చర్చిస్తారు. 
	గతేడాది..
	‘సంకల్పాన్ని’ గత విద్యా సంవత్సరంలో ప్రారంభించి మార్చి నెలలో 11 బృందాలు  519 పాఠశాలలను  పరిశీలించి 109 ఉత్తమ పాఠశాలలను, 22 అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పాఠశాలలను సత్కరించాల్సి ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అయితే సంకల్పంలో ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తు చేసుకుంటే 10 పాయింట్లు కలిపారు. 
	89 అంశాల పరిశీలన..
	పాఠశాలల్లో నిర్దేశించిన 89 అంశాలను తనిఖీ బృందాలు పరిశీలిస్తాయి. వీటిలో ముఖ్యంగా పాఠశాల అసెంబ్లీ నిర్వహణ, రిజిస్టర్లు, మధ్యాహ్న బోజన పథకం, లైబ్రరీ, సబ్జెక్టుల వారీగా విద్యార్థుల నైపుణ్యం తదితర అంశాలను పరిశీలిస్తారు. అక్టోబరులో ఈ కార్యక్రమం కింద పరిశీలించిన పాఠశాలలను నాలుగు నెలల అనంతరం మరోసారి పరిశీలిస్తారు. ఈ మధ్యలో ఆ పాఠశాలలో వచ్చిన మార్పును గమనించి గ్రేడింగ్ ఇస్తారు. జిల్లాలో గతేడాది పరిశీలించిన 519 పాఠశాలలను మినహాయించి జిల్లాలోమిగిలిన 3905 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. 
 
					
					
					
						