
గోల్‌మాల్
స్థానిక ముద్దిరెడ్డిపల్లి పోస్టాఫీసులోని ఖాతాదారుల సొమ్ము స్వాహా కేసు ఏడాది గడిచినా అతీగతీలేకుండా పోయింది.
– తేలని ముద్దిరెడ్డిపల్లి పోస్టాఫీసులో డబ్బుల వ్యవహారం
– ఏడాది గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు
హిందూపురం అర్బన్ : స్థానిక ముద్దిరెడ్డిపల్లి పోస్టాఫీసులోని ఖాతాదారుల సొమ్ము స్వాహా కేసు ఏడాది గడిచినా అతీగతీలేకుండా పోయింది. పోస్టాఫీసులో ప్యాకర్‌గా పని చేసిన కల్యాణŠ æచక్రవర్తి కొందరి ఖాతాల్లోంచి డబ్బును డ్రా చేసుకుని జేబులు నింపుకుని ఉడాయించిన సంగతి తెలిసిందే. పోస్టాఫీసుకు వచ్చి ఖాతాలో జమ చేసినప్పుడల్లా బుక్‌లో సీల్ వేసి డబ్బు కాజేస్తూ వచ్చాడు. ఇలా రూ.లక్షల్లో గోల్‌మాల్ అయింది. ఈ సంఘటన 2015 సెప్టెంబరులో వెలుగులోకి వచ్చింది. కానీ ఇంవరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని బాధితులు వాపోతున్నారు.
ముద్దిరెడ్డిపల్లిలో మగ్గం కూలీలు నందవరమ్మ, రత్నమ్మ పోస్టాఫీసులో 2013 నుంచి జ మ చేస్తూ వచ్చారు. పొదుపు పథకంలో నందవరమ్మ 2013 ఏప్రిల్ నుంచి 2014 డిసెంబరు వరకు పాసుబుక్ నంబరు 1050007లో మొత్తం రూ.67 వేలు దాచింది. అలాగే రత్నమ్మ పాసు బుక్ నంబరు 1050106లో తన ఖాతాలో 2013 ఏప్రిల్ నుంచి 2014 డిసెంబరు వరకు రూ.57 వేలు కట్టింది. అదేవిధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద పాసుబుక్ 706046లో మరో రూ.40 వేలు కట్టింది.
ఖాతాదారులు డబ్బు కట్టడానికి పోస్టాఫీసుకు వచ్చినప్పుడు అక్కడే పని చేస్తున్న ప్యాకర్ కల్యాణ్ చక్రవర్తి డబ్బు తీసుకుని పాస్‌బుక్‌లో కట్టిన ట్లు సీల్ వేస్తూ పథకం ప్రకారం డబ్బు కాజేస్తూ వచ్చాడు. రెండు ఖాతాల నుంచి సుమారు రూ.1,64 లక్షలు స్వాహా చేసుకున్నాడు. ఇవే కాకుండా సుమారు 40 మందికి సంబంధించిన ఖాతాల్లో వారికి తెలియకుండానే డబ్బుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. విషయం బయటపడగానే విధులకు రాకుండా పరారయ్యాడు.
బయటపడింది ఇలా..
నందవరమ్మ తాను దాచుకున్న సొమ్ములో కూతురు పెళ్లి కోసం కొంత డ్రా చేసుకుందామని పోస్టాఫీసుకు వెళ్లి విచారిస్తే ఖాతాలో డబ్బే లేదన్నారు. అసలు మీరు డబ్బు కట్టనే లేదని చెప్పారు. అప్పుడు బ్యాంక్ అధికారులు పాస్‌బుక్‌లు పరిశీలిస్తే స్వాహాల పర్వం బయటపడింది. రత్నమ్మ ఖాతాలోని డబ్బు కూడా ఆమెకు తెలియకుండానే డ్రా అయిపోయింది. బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ నాగభూషణరెడ్డి పోస్టాఫీసు వద్ద ఆందోళన కూడా చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెడ్‌పోస్టాఫీసు అధికారులు స్వీకరించి విచారణ చేపట్టారు. అయితే ఇంతవరకు న్యాయం జరగలేదు.