మోకాళ్ల పర్వతం వద్ద కిక్కిరిసిగా నడిచివస్తున్న భక్తులు
తిరుమల శనివారాల్లోని మొదటి శనివారం కావటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో కిక్కిరిసిపోయాయి. వీరిలో ఎక్కువ మంది తమిళనాడు, చిత్తూరు జిల్లా వాసులే అధికంగా ఉన్నారు.
– కిక్కిరిసిన అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు
– సా:6గంటల వరకు 69,502 మందికి స్వామి దర్శనం
– 29,716 మంది మెట్లమార్గంలో రాక
సాక్షి,తిరుమల:
పెరటాశి (తమిళనెల) తిరుమల శనివారాల్లోని మొదటి శనివారం కావటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో కిక్కిరిసిపోయాయి. వీరిలో ఎక్కువ మంది తమిళనాడు, చిత్తూరు జిల్లా వాసులే అధికంగా ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు రెండు కాలిబాటల్లోనూ 29,716 మంది భక్తులు నడిచి తిరుమలకొండెక్కారు. దీంతో కాలిబాట భక్తులతో నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండాయి. భద్రతా సిబ్బంది భక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేసి క్యూలైన్లలోకి అనుమతించారు. క్యూలైన్లలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆలయం, భద్రతా సిబ్బంది చొరవ తీసుకుని క్యూలైన్లను క్రమబద్దీకరించారు. సర్వదర్శనం క్యూలైన్లు కూడా భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 69,502 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. పెరిగిన రద్దీ వల్ల గదులు ఖాళీ లేవు. అన్ని రిసెప్షన్‌కేంద్రాల్లోనూ భక్తులు గదుల కోసం నిరీక్షించారు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది.