ఓ గుండె వ్యధ..

ఓ గుండె వ్యధ..


పూటగడవని స్థితిలో అభాగ్యుడు

గుండె మార్పిడికి రూ. 30 లక్షలు

ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు




రెండు ఎకరాల పొలం... వరుస కరువులు.. పంట నష్టాలు... ఓ రైతును కుదేలు చేశాయి. కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. పిల్లాపాపలతో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. గుండె జబ్బు చేసి ఆస్పత్రుల పాలయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం గుండె మార్పిడి తప్పనిసరి అని తేలింది. రూ. లక్షల వ్యయంతో కూడుకున్న ఈ శస్త్రచికిత్సకు డబ్బు సమకూర్చుకోవడం అతనికి తలకు మించిన భారమైంది. కళ్లముందు కట్టుకున్న భార్య, లోకం తెలియని ఇద్దరు చిన్నారులు కనిపించారు. తాను ఈ లోకం వీడిపోతే వారి పరిస్థితి ఏమిటనేది అతన్ని మరింత కుంగదీసింది. తనకు పునర్జన్మను ప్రసాదించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు.  





పామిడి మండలం, గజరాంపల్లి గ్రామానికి చెందిన డి.రమేష్‌రెడ్డి.. రెండు ఎకరాల సన్నకారు రైతు.  ఇతనికి భార్య రమాదేవి, కుమార్తె డి.హారిక (6వ తరగతి), కుమారుడు లిఖిత్‌రెడ్డి (3వ తరగతి) ఉన్నారు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయంపైనే ఆధారపడిన రమేష్‌రెడ్డి.. వరుస కరువులతో అప్పుల పాలయ్యాడు. ఇక పంట సాగుతో లాభం లేదనుకున్న అతను ఐషర్‌ వాహనం డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.



మూడేళ్ల క్రితం...

మూడేళ్ల క్రితం ఐషర్‌ వాహనంలో లోడు తీసుకుని బయలుదేరుతుండగా రమేష్‌రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో చికిత్సలు మొదలు పెట్టించాడు. ఫలితం లేకుండా పోయింది. వైద్యుల సూచన మేరకు కర్నూలులోని వైద్య నిపుణులను సంప్రదించి చికిత్సలు మొదలు పెట్టించాడు. వారాలు.. నెలలు గడుస్తున్నా ఆరోగ్యం మెరుగు పడలేదు. అప్పటికే కుటుంబ పోషణ భారమైంది. ఏనాడూ గడప దాటి ఎరుగని ఇల్లాలు.. చివరకు కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీగా మారారు. అరకొర పనులతో వస్తున్న కూలీ డబ్బుతో కుటుంబ పోషణ భారమైంది. ఉన్న ఇద్దరు పిల్లల్లో అమ్మాయిని పామిడి వద్ద ఉన్న మోడల్‌ స్కూల్‌లో చేర్పించారు. కుమారుడిని యాడికిలోని తన అక్కబావ నాగేంద్రమ్మ, సూర్యనారాయణరెడ్డి వద్దకు రమాదేవి వదిలారు. సజావుగా సాగిపోతున్న రమేష్‌రెడ్డి కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధి తీవ్ర కల్లోలాన్ని సష్టించింది.



ఆస్తులు అమ్ముకున్నా...

తీవ్ర అనారోగ్యంతో బలహీన పడుతున్న రమేష్‌రెడ్డి  చివరకు హైదరాబాద్‌లోని కిమ్స్‌ వైద్యశాలకు చేరుకున్నాడు. అక్కడ పలు రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం అతని గుండె బలహీన పడుతోందని వైద్యులు గుర్తించారు. గుండె మార్పిడి చికిత్స ఒక్కటే మార్గమని అందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని తేల్చి చెప్పారు. ఈ విషయం రైతు కుటుంబాన్ని కుదేలు చేసింది. ఇప్పటికే చికిత్సల కోసం ఉన్న రెండు ఎకరాల పొలాన్ని కూడా అమ్ముకున్నారు. శస్త్రచికిత్స కోసం రూ. 30 లక్షలు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి తలకు మించిన భారమైంది. ప్రస్తుతం రమేష్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. తీవ్ర ఆయాసంతో బాధపడుతూ కనీసం రెండు అడుగులు కూడా వేయలేకపోతున్నాడు. ఓ రేకుల షెడ్‌లో ఉంటూ భార్య కూలీ పనుల ద్వారా తీసుకువచ్చే అరకొర సొమ్ముతో బతుకునీడుస్తున్నారు. కనీసం మందుల కొనుగోలు చేసేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన శస్త్రచికిత్సకు అవసరమైన సొమ్మును దాతలు సమకూర్చాలంటూ వేడుకుంటున్నాడు.



సాయం చేయదలిస్తే...

రమేష్‌రెడ్డి, గజరాంపల్లి, పామిడి మండలం

బ్యాంక్‌ ఖాతా  నంబర్‌ ః 04221 001 1080 154

బ్యాంక్‌ ః ఆంధ్రాబ్యాంక్, పామిడి

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌–అNఈఆ 0000 422 (ఇంగ్లీష్‌ అక్షరాలున్నాయి)

సెల్‌ నంబర్‌ ః 94916 80909  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top