‘ఘంటా’ దిష్టిబొమ్మ దహనం | Sakshi
Sakshi News home page

‘ఘంటా’ దిష్టిబొమ్మ దహనం

Published Sat, Nov 26 2016 3:20 AM

‘ఘంటా’ దిష్టిబొమ్మ దహనం - Sakshi

నిర్మల్ అర్బన్: గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఆధ్వర్వంలో శుక్రవారం టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఓఎంఆర్ షీట్‌లపై ఫొటోలు వేయకపోవడం, కోడింగ్, డీకోడింగ్ లేకపోవడం, అనుభవం లేని ఇన్విజిరేటర్లు విధులు నిర్వహించారన్నారు.

బయోమెట్రిక్ విధానంలో విఫలం, 40శాతం అభ్యర్థుల వేలిముద్రలు మాత్రమే తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గ్రూప్ - 2లో కొన్ని ప్రశ్నలు నక్సలైట్ నాయకుల పేర్లను, నక్సలైట్ల ఎన్‌కౌంటర్, జనశక్తి సంఘాల గురించి ఉన్నాయని, దీంతో అభ్యర్థుల్లో నక్సలిజం భావాలను పెంచారని ఆరోపించారు. వెంటనే చైర్మన్ పదవి నుంచి ఘంటా చక్రపాణిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అజీమ్, రాకేశ్‌రెడ్డి, నిఖిల్, వినీత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement