పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ వివాదం సమసిపోనుంది.
పాలకోడేరు(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ వివాదం సమసిపోనుంది. దీనిపై గ్రామస్తులతో మంగళవారం మంత్రులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు చర్చలు జరిపారు. తాము ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి అదే చోట నెలకొల్పాలన్న దళితుల డిమాండ్‌కు మంత్రులు అంగీకరించారు. ఇందుకు గరగపర్రు గ్రామస్తులంతా ఓకే చెప్పటంతో సమస్య కొలిక్కి వచ్చినట్లయింది.
ఈ వివాదంతో గత కొద్దిరోజులుగా గరగపర్రులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలువురు రాజకీయ నాయకులు, కుల, ప్రజా సంఘాల నేతలు ఇక్కడ పర్యటించారు. సమస్యను ఇరువర్గాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంతో వివాదం సద్దుమణిగింది.


