గంజాయి గుట్టలు | ganja bags | Sakshi
Sakshi News home page

గంజాయి గుట్టలు

Aug 6 2016 11:35 PM | Updated on Sep 4 2017 8:09 AM

పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి పోలీసుస్టేషన్లలో గుట్టలుగా పేరుకుపోయి ఉంది. మూటలుగా కట్టి గదుల్లో పడేసి ఉంచారు. నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణ పరిధిలో ఇప్పటికే 4 వేల కిలోల గంజాయి నిల్వ ఉంది.

పేరుకుపోతున్న సరుకు
రోలుగుంట: పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి పోలీసుస్టేషన్లలో గుట్టలుగా పేరుకుపోయి ఉంది. మూటలుగా కట్టి గదుల్లో పడేసి ఉంచారు. నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణ పరిధిలో ఇప్పటికే 4 వేల కిలోల గంజాయి నిల్వ ఉంది. దీనిని గదుల్లో నిల్వ చేసి కాపలా కాయడం సిబ్బందికి భారంగా మారింది. ఈ గంజాయిని సుదూర అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నతాధికారులకు పోలీసులు నివేదించారు. 
 వాహనాలను ఉంచేందుకు అవస్థలు
మరోవైపు గంజాయితో పట్టుబడిన కారులు, ఆటోలు, వ్యాన్‌లు, ఇతర వాహనాలు గంజాయితో పాటు పెరుగుతున్నాయి. గతేడాది రోలుగుంట మండలంలో సుమారు 15 వాహనాలు పట్టుబడగా, ఈ ఏడాది సుమారు 20 పైబడి దొరికాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 2,100 కిలోల గంజాయి పట్టుబడింది. అయితే వాహనాలను ఎక్కడ ఉంచాలో, గంజాయిని ఎలా భద్రపరచాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులకు పని భారం పెరిగింది. కొట్లాటలు, దోపిడీలు, అల్లర్లు, రోడ్డు ప్రమాదాలు, వాహన తనిఖీలు తదితర కేసులతో సతమతం అవుతున్నారు. వీటితో పాటు హత్యలు, అత్యాచార, అట్రాసిటీ కేసుల నమోదుతో సిబ్బంది తలమునకలై ఉన్నారు. మండలంలో దీర్ఘకాలంగా గంజాయి రవాణా జరుగుతుండడం.. ముఖ్యంగా బీబీ పట్నం గ్రామం దీనికి కేంద్రం అవుతుండడంతో పోలీసులు నిత్యం తనిఖీలు సాగించాల్సి వస్తోంది. రోలుగుంట పోలీసు స్టేషన్‌లో ఉన్న గదులు గంజాయితోను, ఆవరణ వాహనాలతో నిండిపోయి ఉన్నాయి. పట్టుబడిన వాహనాల్లో కొన్ని కొత్తవి ఉండడం విశేషం. సారా కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్న మాదిరిగానే గంజాయి వాహనాలను కూడా వేలానికి అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తులను కోరుతున్నారు.
శీలావతి రకానికి భారీ గిరాకీ
స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీలో కిలో రూ.వెయ్యి నుంచి రూ.1500 కొని దానిని ఇతర రాష్ట్రాలకు చేర్చి అక్కడ కిలో రూ. 5000 వరకూ విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో తమిళనాడు, తెలంగాణ , కేరళ, మహారాష్ట్రలకు చెందిన వారు గంజాయి తరలిస్తూ ఎక్కువగా పట్టుబడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో పండించే శీలావతి రకం గంజాయికి ఎక్కువగా గిరాకీ ఉంది. ఇతర రాష్ట్రాలవారు ఇక్కడ నుంచి సరుకు తీసుకెళుతుంటారు. గతంలో తమిళనాడుకు చెందిన కొందరు విశాఖ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేసేవారని చెబుతారు. అయితే ప్రస్తుతం స్థానికులే చేపడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement