అప్పుల బాధతో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్లో మంగళవారం జరిగింది.
వరంగల్ రూరల్ జిల్లా: అప్పుల బాధతో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్లో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన గుండెబోయిన సుధ(40)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఏ పనీ చేయకపోవడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. తమకున్న ఎకరం పొలానికి తోడు మరో ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకున్నది.
ఈ నేపథ్యంలో పంట కోసం, గత ఏడాది పెద్ద కుమార్తె పెళ్లి చేసేందుకు అప్పులు చేసింది. ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు కూడా కావడంతో సంఘానికి కిస్తీలు చెల్లించాల్సి ఉంది. దీంతో అప్పుల బాధతో ఆమె మంగళవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగగా కుటుంబీకులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుధ మృతిచెందింది.