ఆరిన అంధుల దీపం | extinguished the lamp for the blind | Sakshi
Sakshi News home page

ఆరిన అంధుల దీపం

Mar 22 2017 1:30 AM | Updated on Apr 3 2019 4:04 PM

నరసాపురం అంధుల పాఠశాల వ్యవస్థాపకుడు బొండా ఇజ్రాయిల్‌ (84) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు

నరసాపురం : నరసాపురం అంధుల పాఠశాల వ్యవస్థాపకుడు బొండా ఇజ్రాయిల్‌ (84) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పట్టణంలో అంధుల పాఠశాలను ఏర్పాటు చేసి అనేకమంది దివ్యాంగుల జీవితాల్లో ఇజ్రాయిల్‌ వెలుగులు నింపారు. ఇజ్రాయిల్‌ మృతిపై పలు రాజకీయపార్టీల నాయకులు, విద్యాసంస్థల ప్రతినిధులు, దళిత సంఘాలు సంతాపం తెలిపాయి. 1932 ఆగస్ట్‌ 4న చందపర్రులో జన్మించిన ఇజ్రాయిల్‌ ఉన్నత విద్యనభ్యసించారు. 1962లో పట్టణంలో ఆంధ్రా మోడల్‌ బ్లైండ్‌ స్కూల్‌ పేరుతో అంధుల పాఠశాలను నెలకొల్పారు. 2016 వరకూ పాఠశాల కరస్పాండెంట్‌గా వ్యవహరించారు. 1969లో ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్పు చేయడంలోనూ, 1972లో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అంధులను పాఠశాల తరఫున హాజరుపర్చడంలోనూ కీలకపాత్ర పోషించారు. 1974లో అంధులకు వృత్తి శిక్షణా కేంద్రం, 1976లో పునరావాస కేంద్రం కూడా నెలకొల్పారు. ఇప్పటివరకూ అంధుల పాఠశాల నుంచి 500 మంది పైగా 10వ తరగతి పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అనేకమంది అంధులు ఈ పాఠశాలలో చదివిన వారే కావడం గమనార్హం
ఎన్నో అవార్డులు, పురస్కారాలు 
ఇజ్రాయిల్‌కు లండన్‌ కు చెందిన వరల్డ్‌ బ్‌లైండ్‌ యూనియన్‌ లో శాశ్వత సభ్యత్వం ఉంది. ముంబైకి చెందిన నేషనల్‌ అసోసియేషన్‌  ఆఫ్‌ బ్లైండ్‌లో కూడా శాశ్వత సభ్యత్వం ఉంది. న్యూఢిల్లీకి చెందిన ఆలిండియా కాన్ఫెడరేషన్‌  ఆఫ్‌ ది బ్లైండ్‌ అనే సంస్థ ఇజ్రాయిల్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించింది. ఆంధ్రరత్నం, మధర్‌థెరిస్సా అవార్డులు కూడా లభించాయి. ఇవి కాక ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇజ్రాయిల్‌ అంత్యక్రియలు బుధవారం ఉదయం 10 గంటలకు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయిల్‌ మృతికి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పీడీ రాజు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌  పసుపులేటి రత్నమాల, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వైకేఎస్, బుడితి అనిల్, బుడితి దిలీప్, వంగలపూడి జక్కరయ్య, పాలంకి ప్రాసాద్‌ నివాళులరి్పంచారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement