
నిరంతరం హరితహారం
హరితహారం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో 230 కోట్ల మెుక్కలు పెంచడమే లక్ష్యమని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. నర్సంపేటలో గురువారం నిర్వహించిన పండ్లతోరణ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. చెట్లే మానవుడికి జీవనాధారమని, రాబోయే తరాలకు వనరులను అందించడమే లక్ష్యంగా కేసీఆర్ హరితహార ం‡కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.
నర్సంపేట/ఖానాపురం : హరితహారం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో 230 కోట్ల మెుక్కలు పెంచడమే లక్ష్యమని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. నర్సంపేటలో గురువారం నిర్వహించిన పండ్లతోరణ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. చెట్లే మానవుడికి జీవనాధారమని, రాబోయే తరాలకు వనరులను అందించడమే లక్ష్యంగా కేసీఆర్ హరితహార ం‡కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. చైనాలో 500 కోట్లు, బ్రెజిల్‌లో 300 కోట్ల మొక్కలు నాటారని, అదేస్ఫూర్తితో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 230 కోట్ల మొక్కలు నాటాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయని, అక్కడ అడవులు ఉండడమే కారణమని అన్నారు. అందుకే అన్ని జిల్లాల్లో విస్తృతంగా మెుక్కలు నాటి అడవులు పెంచేలా కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించారని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఆరులక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహిళలు చేపట్టడం అభినందనీయమని, రాష్ట్రానికి వీరు ఆదర్శమని అన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పిల్లల పుట్టినరోజు, ఇతర వేడుకల సందర్భంగా మెుక్కలు నాటడం హర్షణీయమన్నారు. అయితే నాటిన మెుక్కలను సంరక్షించడం ముఖ్యమని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. హరితహారం విజయవంతానికి గ్రామాలు, మండలాల్లో 8 కమిటీలు వేశామని, కమిటీ సభ్యులు గ్రామాల్లో తిరుగుతూ ఏ మొక్కలు కావాలో ప్రజలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. 3 గ్రామ పంచాయతీలకు ఒక నర్సరీని ఏర్పాటు చేసి, రానున్న రోజుల్లో ప్రజలు అడిగే మొక్కలను నర్సరీల ద్వారానే ఇస్తామని చెప్పారు. అనంతరం అధికారులు, మహిళలతో జోగు రామన్న ప్రతిజ్ఞ చేయించారు.
నవయుగ అశోకుడు.. కేసీఆర్
నాడు అశోకుడు చెట్లు నాటించాడని, ఇప్పుడు హరితహారం పేరుతో సీఎం కేసీఆర్ మెుక్కలు నాటుతూ నవయుగ అశోకుడిగా పేరు తెచ్చుకుంటున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కన్నబిడ్డల్లా రక్షించాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉండేలా మొక్కలు పెంచుకోవాలని, దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ విడుదల చేశారని చెప్పారు. అనంతరం నల్లబెల్లి మండలం ముచ్చింపులతండాలో జరిగిన తీజ్ వేడుకల్లో పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
హరితహరంలో జిల్లా ఫస్ట్ : కలెక్టర్
హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌కు మొదటి స్థానం లభించిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. జిల్లాకు 2.70 కోట్ల మొక్కల టార్గెట్ ఇవ్వగా, 70 శాతం నాటడం పూర్తయిందన్నారు. జిల్లాలో అత్యధిక మొక్కలు నాటిన నియోజకవర్గంగా నర్సంపేట ముందువరుసలో ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో ముందుకు సాగాలని కోరారు. టీఆర్‌ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజవకర్గంలో ఆరులక్షల మొక్కలు నాటే పండ్ల తోరణ కార్యక్రమం మహిళల భాగస్వామ్యంతోనే విజయవంతమైందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, సెర్ప్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఐకేపీ ఏసీ అంజనీదేవి, తహసీల్దార్లు రమాదేవి, పూల్‌సింగ్ చౌహాన్, సీసీఎఫ్ అక్బర్, డీఎఫ్‌ఓలు కిష్టాగౌడ్, భీమానాయక్, నర్సంపేట నగర పంచాయతీ చైర్మన్ రాంచందర్, కమిషనర్ మల్లికార్జున స్వామి, సీడీపీఓ శారద, టీఆర్‌ఎస్ నాయకులు వేములపల్లి ప్రకాశ్‌రావు, బత్తిని శ్రీనివాస్, కామగోని శ్రీనివాస్, గుంటి కిషన్, వల్లెపు శ్రీనివాస్, ఉపేందర్‌రెడ్డి, గోనెల రవీందర్, నాయిని నర్సయ్య, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ఏసీడీపీఓలు పద్మ, సౌభాగ్య, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్‌హెల్పర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి పాల్గొన్నారు.