ఫైల్
భారీ వర్షాల వల్ల జిల్లాలో తొమ్మిది మంది మృతి చెందినా స్పందించని సీఎం చంద్రబాబు అధికారులు, అధికార పార్టీ నేతలకు సైతం ముందస్తు సమాచారం లేకుండా శని, ఆదివారాల్లో సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో హడావిడిగా పర్యటించారు.
జగన్ పర్యటన ఖరారైన కొద్దిసేపటికే పయనం
ప్రతిపక్ష నేత తిరగనున్న ప్రాంతాల్లో మొక్కుబడి పర్యటన
రోడ్లు, రైల్వేట్రాక్‌లను పరిశీలించి వెళ్లిన సీఎం
బాధితులు ఆందోళన చేయటంతో ఆదివారంపరామర్శలు
సాక్షి, గుంటూరు : జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో వరద ఉధృతికి అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల వల్ల జిల్లాలో తొమ్మిది మంది మృతి చెందినా స్పందించని సీఎం చంద్రబాబు అధికారులు, అధికార పార్టీ నేతలకు సైతం ముందస్తు సమాచారం లేకుండా శని, ఆదివారాల్లో సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో హడావిడిగా పర్యటించారు. తన నివాసానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరద ప్రాంతాల బాధితులను కనీసం పరామర్శించని సీఎం శని, ఆదివారాల్లో మాత్రం హడావుడిగా పర్యటించి మమ అనిపించారు.
ఈ హడావుడి ఎందుకంటే...
ఇంత హడావిడిగా సీఎం పర్యటించడానికి కారణం.. జిల్లాలోని గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారు కావడమే. శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం నుంచి హుటాహుటిన వరద ప్రాంతాల పర్యటనకు విచ్చేశారు. గతంలో కూడా వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై ఆందోళన చేసేందుకు తేదీ ప్రకటించగానే తానూ చేస్తానంటూ హడావుడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. పోనీ వరద బాధితుల పరామర్శ అయినా సక్రమంగా చేశారా అంటే అదీ లేదు. హడావుడిగా హెలికాప్టర్‌లో వెళ్లి రెడ్డిగూడెం, ధూళిపాళ్ల, క్రోసూరులో రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్‌లను పరిశీలించి పర్యటన ముగించుకుని గుంటూరుకు చేరుకుని సమీక్షల పేరుతో అర్ధరాత్రి వరకూ కలెక్టరేట్‌లో గడిపి వెళ్లిపోయారు. తనను కలిసేందుకు వచ్చిన వరద బాధితులను సైతం పలకరించకపోవడం గమనార్హం. దీంతో రెడ్డిగూడెంలో మహిళలు రోడ్డుపైకి చేరి ఆందోళనకు దిగడంతో పాటు సీఎం కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్నారు. కష్టాలు చెప్పుకొందామని వస్తే పోలీసులతో గెంటివేశారని, ఈ మాత్రానికి ఎందుకు వచ్చారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన ఉందని తెలియని టీడీపీ జిల్లా నాయకులు శనివారం మధ్యాహ్నం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జిలు హాజరుకావాల్సి ఉండగా, సీఎం పర్యటన మధ్యాహ్నం ఉండటంతో అర్ధాంతరంగా ముగించి పర్యటనకు వెళ్లారు. సీఎం ఇంత హడావిడిగా వరద ప్రాంతాల్లో ఎందుకు పర్యటించారో అర్థంకాక మొదట టీడీపీ నేతలు సైతం అయోమయంలో పడ్డారు. చివరకు విషయం తెలుసుకుని తమ నాయకుడి తెలివితేటలకు లోలోన మురిసిపోయారు. అయితే వైఎస్ జగన్ గురజాల నియోజకవర్గం దాచేపల్లి నుంచి వైఎస్ జగన్ పర్యటన మొదలుకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం మళ్లీ హడావుడిగా సీఎం దాచేపల్లి, గురజాల, రెంటచింతలలో పర్యటించారు. ఇదంతా చూసిన జిల్లా వాసులు సీఎంకు వరద బాధితులను పరామర్శించాలనే చిత్తశుద్ధి లేదని, కేవలం వైఎస్ జగన్‌కు ఎక్కడ పేరు వస్తుందోననే రాజకీయ కోణంతో వెళ్లారని నిట్టూరుస్తున్నారు.
సీఎం సేవలో ఉన్నతాధికారులు.. నిలిచిన సహాయక చర్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు శని, ఆదివారాల్లో హడావిడిగా జిల్లాలోని సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పర్యటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నుంచి ఉన్నతాధికారులంతా ఆయన సేవలో తరించారు. దీంతో వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే సూచనలు కూడా చేయలేని పరిస్థితి. దీంతో వరద బాధితులకు సహాయక చర్యలు నిలిచిపోయాయి. వరద ప్రాంతాల్లో అన్ని శాఖలకు సంబంధించి దెబ్బతిన్న పనులను పునరుద్ధరించే పనులు సైతం నిలిచిపోయాయి. దీంతో సీఎం పర్యటన వల్ల వరద బాధితులకు ఎటువంటి ఉపయోగం కలుగకపోగా, ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.