వినతుల ఏ‘కరువు’ | central drought team tour complete | Sakshi
Sakshi News home page

వినతుల ఏ‘కరువు’

Jan 24 2017 10:27 PM | Updated on Jun 1 2018 8:39 PM

వినతుల ఏ‘కరువు’ - Sakshi

వినతుల ఏ‘కరువు’

ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం పేరిట కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం జిల్లా పర్యటన మంగళవారం ముగిసింది.

- ముగిసిన కరువు బృందం పర్యటన
– జిల్లాను అన్ని విధాలా ఆదుకోవాలి
-  రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల వినతి

అనంతపురం అగ్రికల్చర్‌ : ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం పేరిట కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం జిల్లా పర్యటన మంగళవారం ముగిసింది. తొలిరోజు హిందూపురం, పరిగి, గోరంట్ల, బుక్కపట్నం, కొత్తచెరువు, పెనుకొండ, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల పరిధిలో పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యింది. అనంతరం కేంద్ర బృందం రెండో రోజు మంగళవారం కేవలం అరగంట పాటు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి వినతులు స్వీకరించి, ఉదయం 9.20 గంటలకు ఇక్కడి నుంచి కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లింది.

కేంద్రబృందాన్ని కలిసిన రాజకీయ పార్టీలు
    స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉదయం కేంద్ర కరువు బృందం సభ్యులు జేకే రాథోడ్, జీఆర్‌ జర్గర్, ఎం.రామకృష్ణతో పాటు కలెక్టర్‌ కోనశశిధర్, జేసీ బి.లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను వివిధ రాజకీయ పార్టీల నేతలు కలిసి కరువు నిర్మూలనకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాలువ శ్రీనివాసులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి తదితరులు కలిసి వినతులు అందజేశారు. కరువు పరిస్థితులు ఉన్నందున ‘అనంత’కు కేంద్రం నుంచి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.  

రూ.3 వేల కోట్లు ఇవ్వాలి :
    తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో తక్షణం రూ.3 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఐదేళ్ల కాలపరిమితితో శాశ్వత కరువు నివారణకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ తదితర వామపక్ష పార్టీ నేతలు సంయుక్తంగా కేంద్ర బృందాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు.  ఎకరాకు రూ.20 వేల ఇన్‌పుట్, 300 రోజులు ఉపాధి పనులు, రూ.300 కూలీ చెల్లించడం, హంద్రీ–నీవాను జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి నిధులు విడుదల చేయాలని కోరారు. వామపక్ష పార్టీ నాయకులు జి.ఓబులు, వి.రాంభూపాల్, డి.జగదీష్, పెద్దన్న, ఇండ్ల ప్రభాకరరెడ్డి, ఓ నల్లప్ప, బీహెచ్‌ రాయుడు, జాఫర్‌ తదితరులు ఉన్నారు.

హంద్రీ–నీవా ద్వారా 80 టీఎంసీలు
 హంద్రీ–నీవా ప్రాజెక్టును తక్షణం పూర్తి చేసి జిల్లాకు 80 టీఎంసీల నీళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, జిల్లా ఇన్‌చార్జ్‌ రవిచంద్రారెడ్డి, నాయకులు మాసూలు శ్రీనివాసులు, జీటీ ప్రభాకర్, కేవీ రమణ, కృష్ణ తదితరులు వినతి పత్రం అందజేశారు. 2013, 2015, 2016 ఇన్‌పుట్‌ సబ్సిడీ, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి  జిల్లా ప్రజలు, రైతులను ఆదుకోవాలన్నారు.

ఫసల్‌ బీమా వర్తింపజేయాలి
 వేరుశనగ పంటకు ఫసల్‌బీమా వర్తించేలా సిఫారసు చేయాలని  బీజేపీ  నాయకులు వినతి పత్రం అందజేశారు. శాశ్వత కరువు నివారణలో భాగంగా నదుల అనుసంధానం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. ఇందులో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరెడ్డి, నాయకులు తలుపుల గంగరాజు, ఎం.శ్రీనివాసులు, జి.లలిత్‌కుమార్, ఓలేటి రత్నమయ్య, పెద్దన్న, దాసరి రామ్మూర్తి, వెంకటనాయుడు తదితరులు ఉన్నారు.

రుణాలు మాఫీ చేయాలి
 ఖరీఫ్‌–2016లో తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటు ఎకరాకు రూ.20 వేల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖరరెడ్డి, నాయకులు చెన్నారెడ్డి, టి.రామాంజనేయులు, కె.సరస్వతి తదితరులు కేంద్ర బృందానికి వినతి పత్రం అందజేశారు. వేరుశనగకు ఫసల్‌బీమా వర్తింపజేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.

ఉచితంగా విత్తనాలు, ఎరువులు :
    కరువును దృష్టిలో ఉంచుకొని జిల్లా రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందజేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డి.లక్ష్మిదేవి, జిల్లా కార్యదర్శి కె.మల్లేశ్వరి వినతిపత్రం ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని, తాగునీటి సమస్య నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.నూర్‌బాషా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.ఫణీంద్రనాథరెడ్డి,  రెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా, న్యాయవాదుల సంఘం తరఫున వేర్వేరుగా కేంద్ర బృందానికి వినతి పత్రాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement