ముంగారు’ మురిసింది! | Sakshi
Sakshi News home page

ముంగారు’ మురిసింది!

Published Tue, May 2 2017 12:58 AM

ముంగారు’ మురిసింది! - Sakshi

 •  ప్రారంభమైన ‘తొలకర్లు’
 • ఓడీచెరువులో భారీ వర్షం
 • 49 మండలాల పరిధిలో వాన
 • 6.6 మి.మీ సగటు నమోదు   
 • అనంతపురం అగ్రికల్చర్‌ :

  ముంగారు వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జిల్లాలోని 49 మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. మే నెల సాధారణ వర్షపాతం 39.8 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. తొలిరోజే 6.6 మి.మీ సగటు నమోదైంది. ఓడీచెరువు మండలంలో 49.8 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే అమడగూరు 35.4 మి.మీ, నల్లచెరువు 35.4, యల్లనూరు 28.2, యాడికి 24.7, ముదిగుబ్బ 24.3, తలుపుల 20.5 మి.మీ, పామిడి 19.8 మి.మీ, నల్లమాడ 18.1, పెద్దవడుగూరు 17.5, గుంతకల్లు 16.9, గాండ్లపెంట 12.4, గుత్తి 12.2, తాడిపత్రిలో 11.1 మి.మీ మేర  వర్షం కురిసింది. వీటితో పాటు వజ్రకరూరు, ధర్మవరం, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, తనకల్లు, ఉరవకొండ, కొత్తచెరువు, బుక్కపట్నం, కూడేరు, ఎన్‌పీకుంట, బొమ్మనహాళ్‌, కుందుర్పి, నార్పల, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రామగిరి, కంబదూరు, డి.హీరేహాళ్‌, పుట్లూరు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో లోతుగా దుక్కులు చేసుకోవాలని, ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం కావాలని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి, శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, డాక్టర్‌ డి.సంపత్‌కుమార్‌ రైతులకు సూచించారు. 

   

   పొంగిన వాగులు, వంకలు

   ఓడీ చెరువు : మండలంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత  ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సున్నంపల్లి, డబురువారిపల్లి, కుసుమవారిపల్లి, తిప్పేపల్లి, ఓడీసీ, దాదిరెడ్డిపల్లి, గౌరాపురం, చౌడేపల్లి గ్రామాల్లోని చిన్న చిన్న కుంటలు, చెక్‌డ్యాంలు పొంగి పొర్లాయి. తిప్పేపల్లి చెరువుకు సగం వరకు నీరు వచ్చి చేరింది. మహమ్మదాబాద్‌ క్రాసింగ్‌లో ఎగువ ప్రాంతం నుంచి నీరు వచ్చి చేరడంతో ఇళ్లు జలమయ్యాయి. ఇళ్లలోని తిండిగింజలు, దుస్తులు తడిచిపోయాయి. మండల కేంద్రంలోని థియేటర్‌ వద్దనున్న వాగు కదిరి - హిందూపురం రోడ్డుపై భారీగా ప్రవహించింది. దీంతో వాహన రాకపోకలకు కొంతసేపు అంతరాయం కల్గింది. గత 30 ఏళ్లలో ఏనాడూ ఈ వాగు ప్రవహించిన దాఖలాలు లేవని స్థానికులు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోకి వర్షపు నీరు చేరడంతో సోమవారం ‘మీకోసం’కు వచ్చిన అధికారులు, ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. శేషయ్యగారిపల్లి, ఓడీసీ,  మామిళ్లకుంట్లపల్లి గ్రామాల్లో మామిడి కాయలు రాలిపోవడం, చెట్లు విరిగి పడటంతో రైతులకు  నష్టం వాటిల్లింది. జెరికుంటపల్లిలో చిన్న వెంకటరమణ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట, మిట్టపల్లి, ఓడీసీకి చెందిన రైతులు నరసింహారెడ్డి, వెంకటనర్సుకు చెందిన కనకంబరాల పంట దెబ్బతిన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement