వెల్లువెత్తిన ప్రజాదరణ | Sakshi
Sakshi News home page

వెల్లువెత్తిన ప్రజాదరణ

Published Wed, Jul 13 2016 4:07 AM

వెల్లువెత్తిన ప్రజాదరణ - Sakshi

సమస్యల పరిష్కారం జగనన్నతోనే సాధ్యం
రాజన్న పాలన కోసం వైఎస్సార్ సీపీకి అందరూ మద్ధతు పలకాలి
ఒంగోలు పర్యటనలో పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
గడప గడపకు వైఎస్సార్ సీపీకి విశేష స్పందన నేతల దృష్టికి ప్రజా సమస్యలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అరుుతే రాజన్న పాలన మళ్లీ వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిలు పేర్కొన్నారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని కోరారు. గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఐదో రోజు బాలినేని, సుబ్బారెడ్డి కలిసి  ఒంగోలు నగరంలో పర్యటించారు. 6వ డివిజన్ పరిధిలోని నీలాయిపాలెం, గోపాల్‌నగర్‌లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలినేని కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలంతా వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని కోరారు.

 జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ వేటపాలెం మండలం దేశాయిపేటలో పర్యటించి, ప్రజా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లి పంచాయతీ పరిధిలో పర్యటించారు.  పర్చూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ కారంచేడు మండలం ఆదిపూడిలోను, కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడులో నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.

చంద్రబాబు పాలన అవినీతిమయం
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు అర్బన్ :  చంద్రబాబు పాలన అవినీతిమయంగా తయారయిందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మంగళవారం ఒంగోలులో నిర్వహించిన గడగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో ఆయన బాలినేనితో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజా బ్యాలెట్‌ని పంపిణీ చేస్తూ చంద్రబాబు రెండేళ్ల పాలన వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ  మాట్లాడుతూ రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ నాయకులకు రాజధాని భూములను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. 30 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతగా లాక్కున్నారని ధ్వజమెత్తారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గాలికొదిలేసి ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ పల్స్ సర్వే ప్రభుత్వం ఎందుకు చేస్తుందో పరిశీలించి, ఆ అంశంపై ప్రస్తావిస్తామన్నారు. ప్రజలు చంద్రబాబు పాలనపై విసుగుచెంది ఉన్నారని, గడగ గడపకు కార్యక్రమానికి భారీ ప్రజాస్పందన రావడం సంతోషకరమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్నామని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement