అక్రమమైనా సక్రమం చేసేస్తాం! | Sakshi
Sakshi News home page

అక్రమమైనా సక్రమం చేసేస్తాం!

Published Fri, Feb 26 2016 9:23 AM

లింగమనేని గెస్ట్‌హౌస్ - Sakshi

అనుంగు పెద్దలకు సీఎం ఆత్మీయ నజరానా!
ఆక్రమణ భవనం ఇచ్చినందుకు 22 భవనాలకు లైన్‌క్లియర్
కృష్ణా కరకట్ట ఎలైన్‌మెంట్ మార్పుతో అక్రమాలు సక్రమం చేసే ఎత్తుగడ
ముసాయిదాలో లేని ఎగ్జిస్టింగ్ రెసిడెంట్స్.. తుది మాస్టర్‌ప్లాన్‌లో ప్రత్యక్షం
సీఎం చంద్రబాబు తొత్తుల కోసం పేదలకు అన్యాయం

 
సాక్షి, విజయవాడ బ్యూరో: తమ్ముళ్లూ నిప్పులా బతికాను.. నిజాయితీగా నిలిచాను అంటూ డైలాగులు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నది అడ్డగోలుగా చేస్తారనేందుకు కృష్ణా కరకట్ట ఆక్రమణల వ్యవహారమే తాజా ఉదాహరణ. నిబంధనలకు నీళ్లొదిలి, చట్టాలను పునాదుల్లో తొక్కేసి నిర్మించిన అక్రమ భవనాలకు దొడ్డిదోవన రాజముద్ర వేశారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక పలుకుబడి కలిగిన పెద్దలు కృష్ణమ్మను కబ్జా చేసి కరకట్ట దిగువన నిర్మించుకున్న విలాసవంతమైన సౌధాలు ఇప్పుడు సక్రమమని తేల్చేశారు. ఇందుకు సానుకూల పరిస్థితిని కల్పించేలా కృష్ణా కరకట్ట ఎలైన్‌మెంట్ మార్పు, తుది మాస్టర్‌ప్లాన్‌లో ఆర్-1జోన్‌గా చూపించి తన అనుంగు పెద్దలకు ప్రేమతో ముఖ్యమంత్రి నజరానాగా ఇచ్చారు.

దారికి తెచ్చుకున్నది ఇలా..
కరకట్ట దిగువన ఆక్రమించి, పక్కా భవనాలు నిర్మించకూడదన్న నిబంధనలను ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇవ్వాలంటూ గతంలో మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక తమ దారికి తెచ్చుకునేందుకేనని తేటతెల్లమవుతోంది. వీటికి సంబంధించి అప్పట్లో ఆయన అధికారులను కోరి రప్పించుకున్న నివేదిక బుట్టదాఖలైంది. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో 22 ప్రధాన కట్టడాలుండగా వాటిలో మూడు మినహా మిగిలినవన్నీ అక్రమమేనని తాడేపల్లి తహసీల్దార్  లెక్క తేల్చారు.

ప్రస్తుతం సీఎం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ కూడా అక్రమమేనని రెవెన్యూ అధికారులు గతంలో నోటీసులిచ్చేందుకు సిద్ధమయ్యారు. మంత్రులు నారాయణ, పుల్లారావులు పూలింగ్‌లో స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు కూడా. తాజా పరిణామాలతో మంత్రులు, అధికారుల ప్రకటనలన్నీ నీటి మూటలేనని ముఖ్యమంత్రి తేల్చేశారు.

అక్రమాలు సక్రమం చేసే క్లైమాక్స్ ఇది..
సీఎం నివాసంగా మలుచుకోవడం దగ్గర్నుంచి కరకట్ట ఆక్రమణలను సక్రమం చేసుకొనే దాకా ప్రభుత్వ యంత్రాంగం నడిపిన తంతు అంతా ఇంతా కాదు. నేరుగా సీఎం ఆక్రమణ భవనాన్ని నివాసంగా మలుచుకోగా ఆయన తనయుడు లోకేశ్ అక్కడికి సమీపంలోని మరో అక్రమ భవనాన్ని విడిదిగా చేసుకున్నారు. అనుమతిలేని కట్టడానికి మెరుగులు దిద్దేందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుపెట్డడానికి నిబంధనలు అడ్డుకావడంతో ఆ భవనాన్ని క్రమబద్ధీకరించుకున్నారు.

సీఎంకు నివాసయోగ్యంగా మలిచేందుకు ఆ భవనానికి దాదాపు రూ.7 కోట్లకుపైగా ఖర్చుపెట్టారు. కరకట్ట రోడ్డు, సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, హెలీప్యాడ్, ప్రహరీగోడ, సిబ్బంది క్వార్టర్ల కోసం దాదాపు రూ.60 కోట్లకుపైగా వెచ్చించారు. సీఎం నివాసం వద్ద ఇంకా పలు నిర్మాణం పనులు సాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం నివాసం కోసం ఆ భవనాన్ని రెగ్యులరైజ్ చేస్తే అదే కరకట్ట దిగువన ఉన్న అనధికార కట్టడాలను క్రమబద్ధీకరించుకునేలా పెద్దలు చేసిన తెరవెనుక ప్రయత్నాలు ఫలించాయి. దీంతో సీఎం నివాసం, పెద్దల ఆక్రమిత భవనాలు కరకట్ట దిగువన ఉండటంతో వాటిని మినహాయించి కృష్ణా నదికి ఆనుకుని కొత్త కరకట్ట నిర్మించేలా ఎలైన్‌మెంట్ మార్పు చేశారు.

కరకట్ట లోపలి ఆక్రమిత భవనాలు అన్నీ బయటకు వచ్చి గ్రామ విస్తీర్ణంగా పరిగణిస్తే రివర్ కన్జర్వెన్సీ యాక్ట్, నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. మరోవైపు మాస్టర్‌ప్లాన్ ముసాయిదాలో కృష్ణా కరకట్ట ఆక్రమణలను ప్రస్తావించని ప్రభుత్వం తుది మాస్టర్‌ప్లాన్‌లో ఆ ప్రాంతాన్ని ఆర్-1(ఎగ్జిస్టింగ్ రెసిడెంట్స్)గా పేర్కొనడంతో అవి సక్రమమేనని ప్రభుత్వం దొడ్డిదోవన గుర్తింపు ఇచ్చినట్టు అయ్యింది.
 
ఇంత పక్షపాతమా..
పెద్దల విలాస భవనాలకు మినహాయింపు ఇచ్చిన సర్కారు పేదల ఇళ్లకు మినహాయింపు ఇవ్వకుండా పక్షపాతం చూపించడం విమర్శలకు తావిస్తోంది. తుది మాస్టర్‌ప్లాన్‌లో పెద్దల భవంతులను నివాసప్రాంతంగా మార్కు చేసిన ప్రభుత్వం దాదాపు 400లకు పైగా పేదల ఇళ్లను గుర్తించలేదు. రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయిపాలెంలో కృష్ణా కరకట్ట దిగువన ఉన్న పేదలు ఇళ్లను నివాసప్రాంతంగా గూర్తిస్తూ ఆర్-1లో మార్క్ చేయకపోవడంతో వాటిని తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పింది.
 

Advertisement
Advertisement