కృష్ణా పుష్కరాలకు మంగళవారం కాస్త తగ్గిన భక్తుల సంఖ్య ఆరో రోజు బుధవారం మళ్లీ పెరిగింది. 13 లక్షల మంది దాకా పుష్కర స్నానాలు ఆచరించారు.
- పాలమూరులో హారతిచ్చిన కలెక్టర్
సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాలకు మంగళవారం కాస్త తగ్గిన భక్తుల సంఖ్య ఆరో రోజు బుధవారం మళ్లీ పెరిగింది. 13 లక్షల మంది దాకా పుష్కర స్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 9.2లక్షల మంది కృష్ణలో స్నానాలు చేశారు. ఉదయం 8 గంటల వరకు ప్రధాన ఘాట్లలో స్వల్పంగా భక్తుల రద్దీ ఉన్నా ్తర్వాత క్రమేణా పెరిగింది. బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల, సోమశిల, నది అగ్రహారం, పస్పుల, కృష్ణ, క్యాతూర్, పాతాళగంగ తదితర ఘాట్లు భక్తులతో కళకళలాడాయి. వీపనగండ్ల మండలం మంచాలకట్ట వద్ద దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదాయ పద్ధతిలో పిండప్రదానం చేశారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తదితరులు పుణ్య స్నానాలు చేశారు. గొందిమళ్ల వీఐపీ పుష్కరఘాట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ హరినాథరావు పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. నీళ్లు లేకపోవడంతో జూరాల ఘాట్‌లో బుధవారం కూడా స్నానాలను నిలిపివేశారు. పలు ఘాట్లలో నీటి మట్టం తగ్గింది. శ్రీశైలం వరద జలాలతో గొందిమళ్ల, సోమశిల ఘాట్లు నీటితో కళకళలాడాయి. గొందిమళ్లలో కలెక్టర్ టి.కె.శ్రీదేవి నదీ హారతి ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో 3.5 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లకు భక్తులు భారీగా వచ్చారు.
తెలుగు ప్రజల ఆత్మబంధువు వైఎస్
వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా
మంచాలకట్టలో వైఎస్‌కు పిండప్రదానం
కొల్లాపూర్: దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల ఆత్మ బంధువని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మం డలంలోని మంచాలకట్టలో వైఎస్‌కు ఆయన పిండ ప్రదానం చేశారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సేవాదళ్ చైర్మన్ బండారు వెంకటరమణలతో కలిసి పిండ ప్రదాన పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం కృష్ణా నదిలో తర్పణం వదిలాక విలేకరులతో మాట్లాడారు. పలు సం క్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో వైఎస్ ఇప్పటికీ పదిలంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శులు వి.రాజశేఖర్, మేనుగొండ రాము యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వరదారెడ్డి పాల్గొన్నారు.