కేసు భయంతో ప్రాణం తీసుకుంది

Women Suicide Attempt In Peddapalli - Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): మండలంలోని పోతా రం గ్రామానికి చెందిన తులసి అనంతమ్మ(45) పోలీసుకేసు భయంతో ఈనెల 27న పురుగుల మందుతాగింది. చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. అనంతమ్మ మృతికి కారణమం టూ గ్రామానికి చెందిన లింగం మల్లేశం ఇంటిఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. మృతురాలి కటుంబసభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తులసి అనంతమ్మకు చెందిన కోడిని పిల్లి నోటకరుచుకుని పారిపోయింది. గమనించిన అనంతమ్మ వెంబడించింది. పక్కనే ఉన్న మేడి మల్లీశ్వరి ఇంటివైపు పిల్లి వెళ్లింది. అనంతమ్మ తన చేతిలోని కర్రను పిల్లి వైపు విసిరింది. అది మల్లీశ్వరి ఇంటిఎదుట ఉన్న మిరపచెట్లకు తాకింది. తనపై దాడి చేసేందుకే అనంతమ్మ కర్ర విసిరిందని మల్లీశ్వరి గొడవకు దిగింది. ఇద్దరిమధ్య వివాదం ముదిరింది. మల్లీశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనంతమ్మపై ఈనెల 24న  290,323 పెట్టీ కేసు నమోదు చేశారు. ఒక్కసారి స్టేషన్‌కు హాజరైంది. మరోసారి పోలీసులు పిలవగా వెళ్లలేదు. ఒకింత భయాందోళనకు గురై ఈనెల 27న తనఇంట్లో పురుగుల మందు, చీమలమందు కలుపుకుని తాగింది. గమనించిన కుటుంబసభ్యులు జగిత్యాలలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌ తరలించారు. చికిత్స పొందుతు శనివారం ఉదయం చనిపోయింది.

మృతదేహంతో ఆందోళన 
మృతదేహాన్ని నేరుగా గ్రామానికి తీసుకొచ్చారు. తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే అనంతమ్మ ఆత్మహత్య చేసుకుందని, ఈ కేసులో ప్రమేయం ఉన్న మల్లీశ్వరి, పెద్దమనిషిగా వ్యవహరించిన లింగం మల్లేశంతో, పాటు మరోఇద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు లింగం మల్లేశం ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆం దోళన చేశారు. విషయం తెలుసుకుని ఎస్సై రాజయ్య  అక్కడికి చేరుకొని, మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో  వారు ఆందోళన విరమించారు.
 
నలుగురిపై కేసు.. 
అనంతమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడి మల్లీశ్వరి, లింగం మల్లేశంతో పాటు కేసులో సాకు‡్ష్యలుగా వ్యవహరించిన గొల్లపల్లి రాయలింగు, బుర్ర పోషమల్లుపై ఐపీసీ 306 కింద కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top