ప్రియుడి కోసం.. బాబును, భర్తను చంపేసింది

Wife Illegal Affairs Husband Murder - Sakshi

భర్త, కుమారుడిని హత్య చేసిన భార్య

ఏం తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు

వివాహేతర సంబంధమే కారణం

వేలూరు : ప్రేమించి వివాహం చేసుకున్నారు. రెండేళ్లు వారి కాపురం సాఫీగా సాగిపోయింది. ఏడాది క్రితం కుమారుడు జన్మించడంతో సంబరపడ్డారు. అయితే వివాహేతర సంబంధం వారి మధ్య చిచ్చుపెట్టింది. రెండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాలు.. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలోని తాజ్‌పుర మందవేలి గ్రామానికి చెందిన సుబ్రమణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రిషియన్‌. రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దీపిక (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ప్రనీష్‌(1) ఉన్నాడు. ఈ నెల 13వ తేదీ నుంచి తన భర్త, కుమారుడు కనిపించడం లేదని దీపిక ఆర్కాడు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సెల్‌ నంబర్‌ చెబితే వెంటనే కనిపెడతామని పోలీసులు ఆమెకు తెలిపారు.

అయితే తన భర్త సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయాడని చెప్పింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో తడబడడంతో అనుమానించిన పోలీసులు ఆమెను విచారణ చేశారు. ఆ సమయంలో దీపిక తన భర్త రాజా, కుమారుడు ప్రనీష్‌లను హత్య చేసి ఇంటి సమీపంలోని భూమిలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకుంది. అవాక్కైన పోలీసులు గురువారం రాత్రి మృతదేహాలు పూడ్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి 11 గంటల సమయం కావడంతో దీపికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం ఉదయం మృతదేహాలను బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు.

శుక్రవారం ఉదయం తహసీల్దార్‌ వత్సల, డీఎస్పీ కలైసెల్వన్, వేలి ముద్ర నిపుణులను రప్పించి మృతదేహాలను పూడ్చిన ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో రాజా బంధువులు దీపికపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు దీపికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం పాతి పెట్టిన మృతదేహాలను బయటకు తీశారు. వారిని చూసి రాజా బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాలను అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో దీపిక భర్త రాజా తలపై రాతితో కొట్టి హత్య చేసి అనంతరం కుమారుడిని హత్య చేసినట్లు తెలిసింది. దీపికకు భర్త రాజా స్నేహితుడు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top