దంపతుల దారుణ హత్య  

Wife Husband Brutally Murdered In Hasanparthi - Sakshi

భార్యాభర్తల గొంతులు కోసి చంపిన కిరాతకులు

ఉమ్మడి జిల్లాలో కలకలం

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు

హసన్‌పర్తి : దంపతుల దారుణ హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి  కొందరు దుండగులు భార్యాభర్తల గొంతులు కోసి ఘాతుకానికి పాల్పడ్డారు. డాగ్‌స్క్వాడ్‌కు చిక్కకుండా ఉండేందుకు నిందితులు సంఘటన స్థలంలో కారంపొడిని చల్లారు. దీనిని బట్టి .. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన గడ్డం దామోదర్‌(58), పద్మ(49) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెల వివాహాలు చేశారు. పెద్ద కుమార్తె ఉదయశ్రీ, హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్న కూతురు కరుణశ్రీ యూకేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. కుమారుడు పున్నంచందర్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా స్థిరపడ్డాడు.కాగా ఆరు నెలల క్రితం దామోదర్‌ ఇంటో జారిపడగా కాలు విరిగింది. ప్రస్తుతం కోలుకుని కర్ర సాయంతో నడుస్తున్నాడు.   దామోదర్‌ దంపతులు తమ ఇంటిలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ ఇంటిలో భార్యభర్తలు ఇద్దరే ఉంటున్నారు. రాత్రి ఏడు గంటల లోపు షాపు మూసి వేస్తారని, దామోదర్‌ వివాదరహితుడని స్థానికులు పేర్కొన్నారు. 

డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు
సంఘటన స్థలంలో డాగ్‌స్క్వాడ్‌తో గాలించగా జాగిలాలు దామోదర్‌ ఇంటి నుంచి చిన్నంగి చెరువు సమీపంలో ఉన్న వైన్స్‌షాపు వద్దకు వెళ్లి తిరిగి సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పద్మపై దుండగులు లైంగిక దాడి చేసి ఆపై హత్య చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పద్మ బాత్‌రూంలో వివస్త్రగా పడి ఉండడంతో.. లైంగిక దాడి జరిగి ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథరవీందర్‌ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. 

అదుపులో అనుమానితులు? 
కాగా, స్థానికంగా చెందిన కొంతమంది యువకులను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంట్లో విగతజీవులుగా..ఉదయం ఆరుగంటల వరకు దామోదర్, పద్మ ఇంటి బయటికి రాకపోవడం, గేటు వద్ద కారంపొడి కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి పరిశీలించగా బాత్‌రూంలో పద్మ మృతదేహం కనిపించడంతో దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో దామోదర్‌ ఇంటి నుంచి రేకుల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. దామోదర్‌ కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా పడి ఉండగా, పద్మ బాత్‌రూంలో మెడపై గాయాలతో మృతిచెంది ఉంది.పద్మను హత్య చేశాక ఆమె మెడలోని రెండుతులాల నల్లపూసల గొలుసును ఎత్తుకెళ్లారు. బీరువాలోని దుస్తులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా లాకర్‌ కూడా తెరిచి ఉంది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

హత్య వెనుక అనుమానాలెన్నో?
వరంగల్‌ క్రైం: హసన్‌పర్తి బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఇంట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన దంపతుల దారుణ హత్య హసన్‌పర్తిలో సంచలనం సృష్టించింది. దంపతులను అతికిరాతకంగా హత్య చేసి ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చివరకు డాగ్‌ స్క్వాడ్‌కు కూడా ఆధారాలు లభించకుండా కారంపొడి చల్లి హంతకులు పరారు కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. గడ్డం దామోదర్‌(58), గడ్డం పద్మ(49) హత్య ఘటన ఎలా జరిగింది? ఎంత మంది పాల్గొన్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు మాత్రం.. పరిచయస్తులు లేదా ఇంటి పరిసరాలపై అవగాహన కలిగినవారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారనే కోణంలో విచారిస్తున్నారు.  

రెండు నిమిషాల వ్యవధిలోనే .... 
గడ్డం దామోదర్, పద్మల సెల్‌ఫోన్లు రెండు నిమిషాల తేడాతో స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి 11.46 గంటలకు పద్మ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. ఆ తర్వాత 11.48 గంటలకు దామోదర్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అర్ధరాత్రికి ముందే హత్య జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాను విశ్లేషిస్తున్నారు.  

సినిమాను తలపించేలా..  
సినిమాలో చూపినట్లు పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు కనిపిస్తోంది. ఇంటి గేటుకు గడియ పె ట్టి ఉంది. పద్మను బాత్‌రూంలో హత్య చేసి బ యట గొళ్లం పెట్టారు. ఇంట్లో బెడ్‌ఫై దామోదర్‌ ను హత్య చేసి బెడ్‌షీట్‌ కప్పి తలుపులు దగ్గర పెట్టి వెళ్లారు. బాత్‌రూం దగ్గర, గేటు దగ్గర ఆనవాళ్లు దొరకకుండా కారంపొడి చల్లారు. హత్యకు ఉపయోగించిన సిమెంట్‌ ఇటుకను బావిలో పడేశారు.దీంతో పాటు హత్య చేసే సమయంలో చేతికి అంటిన రక్తం మరకలను అక్కడే కడుక్కుని నిందితులు వెళ్లినట్లు తెలుస్తోంది. గడ్డం దామోదర్, పద్మ దంపతుల హత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసిన నిందితులు గోడ దూకి లోపలికి చొరబడి మాటు వేసి హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. హంతకుల కోసం పోలీసులు నాలుగు ఐదు బృందలుగా విడిపోయి గాలిస్తున్నారు.గడ్డం దామోదర్‌ పలువురికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడని, దానికి సంబంధించిన అనేక రకాల డాక్యుమెంట్లు సంఘటన స్థలంలో లభించాయి. ఇంటికి ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకులో సోమవారం రూ.6వేలను దామోదర్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశారు.  

పోపుల పెట్టెలో దొరికిన బంగారం... 
పద్మ వంటగదిలో పోపుల డబ్బాలో బంగారం, డబ్బులు దాచుకోవడం అలవాటు. హత్యకు గురైన దంపతుల పెద్ద కూతురు ఉదయశ్రీ చెప్పిన సమాచారంతో పోలీసులు వంటగదిలో ఉన్న పోపుగింజల డబ్బాను చూడగా అందులో ఒక నల్లపుసల గొలుసు, ఒక ఉంగారం, సుమారు రూ.2వేల నగదు లభించాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top