వరకట్న వేధింపులపై వివాహిత ఫిర్యాదు

Wife Complaint On Extra Dowry case Filed - Sakshi

తెనాలి: స్థానిక త్రీటౌన్‌ పోలీస్‌స్టేషనులో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పట్టణంలోని బాలాజీరావుపేట మసీదు బజారుకు చెందిన భవ్యకు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నివాసి నల్లగొండ వెంకట నాగబాలకృష్ణతో 2015 డిసెంబరు 7న వివాహమైంది. వివాహ సందర్భంగా రూ.2 లక్షల నగదు, 12 సవర్ల బంగారం, 6 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు. ప్రస్తుతం నాగబాలకృష్ణ కానూరులోని ఓ బ్యాంకు బ్రాంచిలో అసిస్టెంట్‌ మేనేజరుగా చేస్తున్నాడు. వివాహమై కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. మగబిడ్డ కలిగాడు. తర్వాతనుంచి భర్త వైఖరి మారిపోయింది. తాగుడు వంటి వ్యసనాలకు అలవాటుపడి  వేధింపులకు గురిచేస్తున్నట్టు భవ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అందంగా లేనని తూలనాడటం, ఆడపడుచు చెప్పుడు మాటలతో భౌతిక హింసకు పాల్పడుతూ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్టు ఆరోపించారు. అత్తమామలకు ఈ విషయం తెలిసినా కొడుకుకు వత్తాసు పలుకుతున్నారని, విడాకులిస్తే తమ బిడ్డకు రెండో వివాహం చేసుకుంటామని చెబుతున్నారని భవ్య వాపోయింది. దీంతో విసిగిపోయి, తెనాలి వచ్చేసినట్టు తెలిపారు. తలిదండ్రులు తన అత్తమామలతో మాట్లాడటంతో బాగా చూసుకుంటామని హామీనివ్వడంతో  మళ్లీ కాపురానికెళ్లినట్టు వివరించారు. అయినప్పటికీ పద్ధతి మారకపోగా, ఈనెల 18వ తేదీ రాత్రి తనను హింసించి, ఇంట్లోంచి బయటకు గెంటేసినట్టు భవ్య ఆరోపించారు. ఆ రాత్రి అక్కడే ఉండి, 19 ఉదయం విజయవాడ వచ్చానని, చేతిలో చార్జీలక్కూడా డబ్బుల్లేవని ఫోనులో తెలియజేయడంతో తలిదండ్రు లొచ్చి తీసుకెళ్లారు. భవ్య తెనాలి త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయగా ఈనెల 20న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top