బావతో కలిసి భర్తను మట్టుబెట్టింది.. | Wife Assassinated Husband With Boyfriend in East Godavari | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Jun 25 2020 8:42 AM | Updated on Jun 25 2020 1:55 PM

Wife Assassinated Husband With Boyfriend in East Godavari - Sakshi

తూర్పుగోదావరి ,మారేడుమిల్లి: వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. తూర్పు ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి మండలం కూడూరులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై డి.రామకృష్ణ కథనం ప్రకారం కూడూరుకు  చెందిన కత్తుల సోమిరెడ్డి(39), భవానీ భార్యా భర్తలు. అదే గ్రామానికి చెందిన కత్తుల సూర్యనారాయణ రెడ్డితో భవానీకి వివాహేతర సంబంధం ఉంది. సూర్యనారాయణ రెడ్డి భవానీకి వరుసకు బావ అవుతాడు. అయితే భార్య భవానీపై అనుమానం వచ్చి, సోమిరెడ్డి ఆమెను ప్రశ్నించడంతో ఇరువురు మద్య గొడవ జరిగింది. దీంతో సోమిరెడ్డి భవానీని మందలించడంతో ఆమె ఆగ్రహించి బుధవారం తెల్లవారుజామున గ్రామానికి సమీపంలోని కొండపోడు వద్ద నివాసముంటున్న కత్తుల సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లిపోయింది. (తల్లి వివాహేతర సంబంధం; ఇద్దరు కుమారులు..)

ఆమె వెనకాలే సోమిరెడ్డి అక్కడికి వెళ్లాడు. దీంతో ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భవానీ, సూర్యనారాయణరెడ్డి కలసి సోమిరెడ్డి గొంతు నులిమి, కర్రతో కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలోని గోతిలో పడేశారు. ఉదయం తనకేమి తెలియనట్టు ఇంటికి తిరిగి వచ్చి తన భర్త కనిపించడం లేదని గ్రామస్తులతో తెలిపింది. గ్రామస్తులందరూ చుట్టు పక్కల గాలించగా ఊరికి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సీఐ రవికుమార్, ఎస్సైలు రామకృష్ణ, సతీష్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. హత్యకు వినియోగించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నిందితులు పరారయ్యారు.

మృతదేహాన్ని పరిశీలించిన ఏఎస్పీ
రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్‌ కూడూరు గ్రామంలో హత్యకు గురైన సోమిరెడ్డి మృతదేహాన్ని, సంఘటన స్థలాన్ని  పరిశీలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామకృష్ణ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement