
ఆస్పత్రిలో తుమ్మలపల్లి రామకృష్ణ, నాగసత్యరాణి మృతదేహాలు
మాయదారి పక్షవాతం వృద్ధ దంపతుల బలవన్మరణానికి కారణమైంది. మంచానికి పరిమితమై నడిచే దారి కనబడక, అయినవారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక భార్యాభర్తలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటన విజయవాడలో మంగళవారం జరిగింది.
సాక్షి, విజయవాడ: నగరంలోని నక్కల రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు కొంతకాలంగా పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నారు. జబ్బు నయం కాదన్న మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భవానిపురం బ్యాంక్ సెంటర్ నివాసితులైన తుమ్మలపల్లి రామకృష్ణ, నాగసత్యరాణిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు తమ చావుకు ఎవరూ కారణం కాదని, తామే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ లెటర్ రాశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీళ్లుపెట్టించిన సూసైడ్ నోట్
తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని తుమ్మలపల్లి రామకృష్ణ సూసైడ్ నోట్‌లో రాశారు. తన జేబులో ఉన్న 8 వేల రూపాయలతో దహన సంస్కారాలు జరిపించాలని అభ్యర్థించారు.