
సాక్షి, తిరుపతి: టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రిలో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. బర్డ్ డైరెక్టర్ జగదీష్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు నేపథ్యంలో విజిలెన్స్ డిఎస్పీ మల్లీశ్వర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వైద్య పరికరాల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని.. ఓ సంస్థకు మేలు చేకూరేలా కొనుగోళ్లు జరిపారనే ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. బర్డ్ ఆసుపత్రి ఏర్పాటు లక్ష్యాన్ని నీరుగార్చేలా ఇక్కడ పరిణామాలు జరుగుతున్నాయని, 2015 నుంచి జరిగిన కొనుగోళ్లపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని మల్లీశ్వర్ రెడ్డి వెల్లడించారు.