ప్రాణం తీసిన అతివేగం.. అబద్ధం

US Police Mistakes Toy Gun In Teenage Girl Hand Shoots Her Dead - Sakshi

వాషింగ్టన్‌ : అతివేగం పనికి రాదంటూ ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా చెవికెక్కించుకోకుండా.. ప్రమాదాల బారిన పడుతుంటారు. అలానే సరదా కోసమో.. లేక బెదిరిద్దామనే ఉద్దేశంతో చేసే పనులు చివరకు మన మెడకే చుట్టుకుంటాయి. ఈ రెండు సంఘటనలు ఓ యువతి జీవితంలో చోటు చేసుకోవడం.. ఆనక ఆమె మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

వివరాలు.. హన్నా విలియమ్స్‌(17) అనే టీనేజర్‌ ఈ నెల 5న అతి వేగంగా కారును డ్రైవ్‌ చేస్తూ పోలీసుల కంటబడింది. ఆమెను ఆపడానికి ట్రై చేసిన పోలీసు వాహనాన్ని ఢీకొట్టి చాలా స్పీడ్‌గా వెళ్లి పోయింది. దాంతో సదరు పోలీసు అధికారి తరువాతి చెక్‌పోస్ట్‌లో ఉన్న అధికారికి హన్నా గురించి సమాచారం ఇచ్చాడు. వేగంగా వస్తోన్న హన్నా వాహనాన్ని గుర్తించి ఆపడానికి వెళ్లాడు సదరు అధికారి.

సదరు అధికారి కారు దిగుతూనే గన్‌ చేతిలో పట్టుకుని.. వాహనాన్ని ఆపమని హన్నాను హెచ్చరించాడు. అధికారి చేతిలో గన్ను చూసిన హన్నా.. అతడిని బెదిరించడానికి డమ్మీ తుపాకీ తీసుకుని షూట్‌ చేయడానికి రెడీ అన్నట్లు నిల్చూంది. ఇంతలో ఆఫీసర్‌ హన్నా కాళ్ల మీద కాల్చడం.. ఆమె కింద పడిపోవడం వెంటవెంటనే జరిగాయి. అయితే అధికారి ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపాడనే విషయం గురించి సరిగా తెలియలేదు. ఆ తర్వాత హన్నా ‘నాకు ఊపిరాడటం లేదు.. సాయం చేయండి’ అంటూ అర్థించింది.

దాంతో సదరు అధికారి.. మరో ఆఫీసర్‌కు కాల్‌ చేసి సంఘటన జరిగిన చోటుకు రప్పించాడు. అనంతరం అధికారుల్దిదరూ కలిసి హన్నాకు ప్రథమ చికిత్స చేసి వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తర్వాత హన్నా చేతి నుంచి కింద పడిన గన్‌ను పరిశీలించగా.. అది డమ్మీ తుపాకిగా తేలింది. ఆస్పత్రిలో చేరిన హన్నా చికిత్స పొందుతూ.. మరణించింది. ఈ విషయం గురించి హన్నా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘కొద్ది రోజులుగా మా కుమార్తె మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది. చికిత్స కూడా తీసుకుంటుంది. అందుకే వీలనైంత వరకూ తనను ఒంటరిగా ఎక్కడికి పంపం. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు తాను బయటకు వెళ్లడం తన ప్రాణం తీసింది’ అంటూ వాపోయారు.

ఈ విషయం గురించి పోలీస్‌ అధికారులు మాట్లాడుతూ.. ‘ఎవరైనా ఓ వ్యక్తి మా వైపు గన్‌ గురిపెట్టి ఉన్నప్పుడు అతని బారినుంచి మమ్మల్ని మేం రక్షించుకోవడమే కాక సదరు వ్యక్తి పారిపోకుండా చూడాలి. సెకన్ల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తి చేతిలో ఉన్నది నిజమైనా ఆయుధమా కాదా అని అనుమానిస్తూ ఉండలేం కదా. అలానే ఇక్కడ అధికారి కూడా హన్నా చేతిలో ఉన్నది నిజం తుపాకీ అనుకుని కాల్పులు జరిపాడు. ఏది ఏమైనా దర్యాప్తు కొనసాగుతుంద’ని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top