ఇద్దరు కిడ్నాపర్లు అరెస్ట్‌

Two Kidnapers Arrest in Boy Kidnap Case - Sakshi

బాలుడి అపహరణ వ్యవహారం ∙ఆర్థిక లావాదేవీలు కారణం  

పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న బాలుడి కిడ్నాప్‌ వ్యవహారంలో ఇద్దరిని తణుకు పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆరేళ్ల బాలుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 4న ఉదయం నిత్యం రద్దీగా ఉండే తణుకు పట్ట ణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అయితే కిడ్నాప్‌ వ్యవహారా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తణుకు పట్టణ పోలీసులు అదేరోజు సాయంత్రం కేవలం నాలు గు గంటల వ్యవధిలోనే ఛేదించారు. తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడులోని ఒక ఇంట్లో నిందితులు బాలుడిని వదిలి వెళ్లినట్టు  సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్టు పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ తెలిపారు.

పట్టిచ్చిన సీసీ కెమెరాలు
గణపవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి తోట పెద్దకాపు మధ్యవర్తులతోపాటు గ్రామంలోని రైతుల నుంచి సుమారు రూ.2 కోట్ల వరకు ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరోవైపు అప్పులపాలైన పెద్దకాపునకు ఒత్తిళ్లు పెరిగిపోవడంతో భార్య దుర్గాభవాని, ఇద్దరు పిల్లలతో 20 రోజుల క్రితం ఊరు వదిలి వెళ్లిపోయారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయవాదిని సంప్రదించడానికి తణుకు వచ్చిన పెద్దకాపు ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డులోని  న్యాయవాది ఇంటికి భార్య దుర్గాభవాని, కుమారుడు తోట సోమసూర్యశశివర్దన్‌ (6)ను తీసుకుని వెళ్లారు. లోపల తల్లిదండ్రులు న్యాయవాదితో మాట్లాడుతున్న క్రమంలో బాలుడు శశివర్దన్‌ ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. ఇదే సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటారుసైకిల్‌పై వచ్చి బాలుడిని అపహరించుకుపోయారు. నిడమర్రు మండలం బువ్వనపల్లి గ్రామానికి చెందిన తన్నీడి విజయకుమార్‌ అలియాస్‌ వాసు, అదే గ్రామానికి చెందిన కోడూరి మధు తమ కుమారుడిని ఎత్తుకుపోయినట్లు పెద్దకాపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ దర్యాప్తు ప్రారంభించారు.

సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డులోని ఒక బియ్యం దుకాణంలో బయట ఉన్న సీసీ కెమెరాలో బాలుడిని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని వెళుతున్న దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఆధారంగా అన్ని చెక్‌పోస్టులను అప్రమత్తం చేసిన పోలీసు అధికారులు ఒకపక్క నిందితులు వాడుతున్న సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. చివరికి తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడు గ్రామంలో బాలుడు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు బాలుడి ఆచూకీ కనుగొన్నారు. పరారీలో ఉన్న నిందితులను ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో విజయకుమార్, మ«ధును బుధవారం అరెçస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన తణుకు సీఐ చైతన్యకృష్ణ, తణుకు, రూరల్, పెరవలి ఎస్సైలు డి.ఆదినారాయణ, ఎన్‌.శ్రీనివాసరావు, వి.జగదీశ్వరరావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరావు అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top