పుళల్‌ జైల్లో ఖైదీల ఖరీదైన జీవితం

TVs And Cell Phones Recovered From Prisoners In Tamil Nadu - Sakshi

స్టార్‌ హోటల్‌ సౌకర్యాలు వీరి సొంతం

సెల్ఫీలతో పట్టుబడిన వైనం    

ఖైదీల రూముల నుంచి18 టీవీలు,3 రేడియోలు స్వాధీనం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘హలో..నేనే మాట్లాడుతున్నా...గంజాయి కంటైనర్‌ ఇండియాకు ఎప్పుడు చేరుతుంది, దొంగనోట్లు ఏమాత్రం పంపుతున్నారు’. ‘పలానా టీవీ దృశ్యాలు భలే రంజుగా ఉన్నాయిరా,  సీరియళ్ల కాలక్షేపం’. ‘అదిరేటి డ్రస్సు నేనేస్తే...’. ‘డార్లింగ్‌ ఎలా ఉన్నావు, పిల్లలు బాగా చదువుతున్నారా..’. ‘లాయర్‌గారూ నాకేసు ఎంతవరకు వచ్చింది, కేసు నుంచి బైటపడతానా..’. ఏంటీ సంభాషణలు అనుకుంటున్నారా చెన్నై పుళల్‌ జైలులోని ఖైదీలు అందరినీ అబ్బురపరిచేలా అనుభవిస్తున్న జల్సా జీవితంలోని కొన్ని మచ్చుతునకలు. పేరుకు నాలుగు గోడల మధ్య జైలు జీవితం..కానీ సువిశాల ప్రపంచానికి ఏమాత్రం తీసిపోని రీతిలో సకల సౌకర్యాలు, సరదా బతుకులు ఇక్కడి ఖైదీలకు సొంతం. అయితే మితిమీరిన ఉత్సాహంతో తీసుకున్న సెల్ఫీలు వారి కొంపముంచాయి. వివరాలు.
తప్పుచేసిన వారికి జైలు శిక్ష విధించేది మానసిక పరివర్తన కోసం అనేది నాటి మాట. జల్సాల కోసమనేది నేటి మాట. చెన్నై శివార్లలోని పుళల్‌ సెంట్రల్‌ జైలులో శిక్షాఖైదీలు, విచారణ ఖైదీలు, మహిళా ఖైదీలు అనే మూడు విభాగాలున్నాయి. ఈ జైల్లో 150 మంది మహిళా ఖైదీలు సహా మొత్తం 2 వేలకు పైగా ఖైదీలున్నారు. వీరిలో హంతకులు, తీవ్రవాదులు, యావజ్జీవ ఖైదీలు ఉన్నారు. పుళల్‌ జైల్లోని శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, విచారణ ఖైదీలు లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లుగా సమాచారం బైటకు వచ్చింది.

అంతేగాక హత్యాఖైదీలు జైలు నుంచి బైటున్న తమ ముఠా సభ్యులతో సంభాషణలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన అనేక హత్యలకు పాత్రధారలు బైటున్నా సూత్రధారులు మాత్రం జైల్లోని ఖైదీలేనని తేలింది. నేరాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రం అధికారులు జైలులోని ఖైదీల వద్ద హడావుడి చేయడం, వారి నుంచి గంజాయి, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. అయితే ఆ తరువాత ఖైదీలు యథాప్రకారం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా, పుళల్‌జైల్లోని ఒక ఖైదీ తాము ఎంతటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నామోని తమ ముఠావారికి తెలియజేసేందుకు సెల్‌ఫోన్లలో సెల్ఫీలు దిగారు, ఫొటోలు తీసుకున్నారు. ఇలా  తీసుకున్న 250 ఫొటోలు గురువారం వివిధ మాధ్యమాల్లో చక్కర్లు చేశాయి. గోడలకు కలర్‌ఫుల్‌ స్క్రీన్‌ పేపర్లు, కిటికీలకు ఖరీదైన కర్టన్లు, అందమైన మంచాలు, మెత్తని పరుపులు, దిండ్లు అన్నీ స్టార్‌హోటల్‌ రూములనుతలపిస్తున్నాయి. ఖైదీలు సైతం జైలు దుస్తులు కాకుండా ప్లేబాయ్‌లా ప్యాంట్లు, టీ షర్టులు, చలువకళ్లద్దాలు, మరి కొందరు పెద్ద మనుషుల్లా పంచెలు, చొక్కాలు ధరించి ఉన్నారు. దీంతో కంగారుపడిన జైళ్లశాఖ అదనపు డీఐజీ అశుతోష్‌శుక్లా, డీఐజీ కనకరాజ్‌ ఉన్నతాధికారుల బృందం గురు, శుక్రవారాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఖైదీలందరినీ జైలు ప్రాంగణంలో ఒకేచోట నిలబెట్టి తనిఖీలు చేపట్టారు. అల్‌ఉమా తీవ్రవాదులకు కేటాయించిన 18 గదుల నుంచి కేబుల్‌ కనెక్షన్‌ సౌకర్యం కలిగి ఉన్న 18 కలర్‌ టీవీలు, మూడు  ఎఫ్‌ఎం రేడియోలు, అనేక సెల్‌ఫోన్లు, ఖరీదైన పరుపులు, దిళ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

అనుమతి లేకుండా అన్ని వసతులు: సహజంగా ‘ఏ’ క్లాస్‌ విభాగంలో ఉంచే ఖైదీలకు ఉన్నతాధికారుల అనుమతితో కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించడం పరిపాటి. అయితే ఎలాంటి అనుమతి లేకుండానే తీవ్రవాదులు తమ గదుల్లో అనేక సౌకర్యాలను కల్పించుకుని జల్సా జీవితాన్ని అనుభవిస్తున్న వైనం బైటపడింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అత్యంత కట్టుదిట్టమైన జైల్లోకి 18 కలర్‌ టీవీలు, ఎఫ్‌ఎం రేడియోలు ప్రవేశించాయి. అనేక తనిఖీలు దాటుకుని ఖైదీల గదుల వరకు ఇవి ఎలా చేరగలిగాయి. వాటికి విద్యుత్‌ సౌకర్యం, కేబుల్‌టీవీ కనెక్షన్‌ ఎలా పొందగలిగారు. జైలు అధికారులు తోడ్పాటు లేకుండా ఖైదీలకు ఇన్ని సౌకర్యాలు అసాధ్యమని భావిస్తున్నారు. లక్షలాది రూపాయల ముడుపులు పుచ్చుకుని ఖైదీలతో లాలూచీ పడినట్లు విశ్వసిస్తున్నారు. అధికారులు తమ వాహనాల్లోనే కలర్‌ టీవీలను పెట్టుకుని ఖైదీలకు చేరవేసినట్లు భావిస్తున్నారు.

అధికారుల అలసత్వం, అవినీతి:జైలు అధికారుల్లో పేరుకుపోయిన అలసత్వం, అవినీతే ఈ దుస్థితికి కారణమని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి తెలిపాడు. జైలు అధికారుల సహకారంతో జామర్లనే జామ్‌ చేసి ఖైదీలు తమ పనికానిచ్చేస్తున్నారు. జల్సాల కోసం ఖైదీలు డబ్బులు వెదజల్లుతున్నారు. వార్డన్‌ మొదలుకుని అధికారుల వరకు అందినంత పుచ్చుకుంటున్నారు. తనిఖీలకు వచ్చేటప్పుడు ముందుగానే సమాచారం అందుతుండడంతో జాగ్రత్త పడుతుంటారు. ఆ తరువాత అంతా షరామామూలే. ఇంటికి జైలుకూ తేడాలేని జీవితాన్ని ఖైదీలు గడుపుతున్నారని ఆయన తెలిపారు. లంచాలు పుచ్చుకునే అధికారులు ఉన్నంతవరకు ఖైదీల జల్సాలకు ఢోకాలేదని ఆయన వాపోయారు. జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరగడానికి జైలు అధికారులు పరోక్షంగా కారకులవుతున్నారని ఆయన ఆరోపించారు.

జామర్లు కూడా జామ్‌: ఖైదీలు సెల్‌ఫోన్లు వాడకుండా కోట్ల రూపాయలతో జామర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ మేరకు చెన్నై పుళల్, మదురై, తిరుచ్చిరాపల్లి, కోయంబత్తూరు, పాళయంగోట్టై, వేలూరు సహా 9 కేంద్రకారాగారాల్లో జామర్లు అమర్చారు. ఖైదీలకు సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చినా మాట్లాడలేరని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జైల్లో ఏర్పాటు చేసిన జామర్లు వృథా ఖర్చుగా మార్చేశారు. అన్ని జైళ్లలోని ఖైదీలు సెల్‌ఫోన్ల ద్వారా తమ కేసులు వాదిస్తున్న న్యాయవాదులతో, కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక కొందరు ఖైదీలు విదేశాలకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా ఒక ఖైదీ గంజాయి, దొంగనోట్ల అక్రమ రవాణాపై 50 సార్లు విదేశాలకు ఫోన్‌ చేసినట్లు తెలుసుకున్నారు. ఖైదీలకు విదేశీ సంబంధాలపై ప్రత్యేకంగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top