‘శరవణ’ యజమానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court Confirms LifeTerm For Saravana Bhavan Owner In Murder Case - Sakshi

శరవణ భవన్‌ ఓనర్‌ రాజగోపాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఉద్యోగిని దారుణంగా హత్య చేయించిన కేసులో రాజగోపాల్‌కు జీవిత ఖైదు

జూలై 7వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : పాపులర్‌ హోటల్‌ చైన్‌ శరవణ భవన్‌ యజమాని పీ రాజగోపాల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఉద్యోగిని కిడ్నాప్‌ చేసి దారుణంగా హత్య చేసిన కేసులో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో నేరస్థులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అలాగే జులై 7వ తేదీలోపు రాజగోపాల్‌ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.  దాదాపు 18ఏళ్ల తరువాత ఈ కేసులు తుది తీర్పు వెలువడింది.

శరవణ భవన్‌ గ్రూపు  ఉద్యోగి శాంతా కుమార్‌ని హత్యచేసిన కేసులో రాజగోపాల్‌ నిందితుడుగా విచారణను ఎదుర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ వాదనతో ఏకీభవించిన మద్రాస్‌ హైకోర్టు  2009లో అతనికి జీవిత ఖైదును విధించింది. దీనిపై రాజగోపాల్‌ సుప్రీంను ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో  2009లో అతనికి బెయిల్‌ మంజూరైంది.  దీనిపై తుది విచారణ చేపట్టిన సుప్రీం శుక్రవారం తీర్పును వెలువరించింది. జస్టీస్‌ ఎన్‌వీ రామన్‌ నేతృత్వంలోని ధర్మాసనం రాజగోపాల్‌తోపాటు మొత్తం ఆరుగురు నేరస్థులకు  జీవిత ఖైదు  శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
 
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చెన్నైలోని శరవణ భవన్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌  కుమార్తె జీవజ్యోతిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌వేశాడు రాజ్‌గోపాల్‌. దీన్ని జ్యోతి గట్టిగా వ‍్యతిరేకించింది. అప్పటికే ఇద్దరు భార్యలున్న రాజగోపాల్‌ పన్నాగాన్ని గమనించిన జ్యోతి తండ్రికూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం 1999లో శరవణ గ్రూపులోనే పనిచేస్తున్నశాంతాకుమార్‌తో జ్యోతికి వివాహ జరిపించారు. 

అక్కడితో ఈ వివాదం ముగిసిపోతుందని భావించారు. కానీ రాజగోపాల్‌లోని మృగత్వం మరింత బుసలు కొట్టింది. తన వేధింపులపర్వాన్ని కొనసాగించాడు. భర్తతో విడిపోయి, తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానంటూ బెదరింపులకు దిగాడు. దీంతో సహనం నశించిన జీవజ్యోతి, శాంతాకుమార్‌ దంపతులు పోలీస్ట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరింత రెచ్చిపోయిన రాజగోపాల్‌ ఫిర్యాదు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే (2001లో అక్టోబర్‌) ఎనిమిది మంది  కిరాయి గుండాలతో శాంతాకుమార్‌ను కిడ్నాప్‌ చేసి హతం చేశాడు. కొడైకెనాల్‌ పెరుమాలమలై అడవుల్లో శాంతాకుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  

కాగా దాదాపు 20 దేశాల్లో హోటళ్లను నిర్వహిస్తూ ప్రాచుర్యం పొందింది శరవణ భవన్‌ హోటల్‌ గ్రూపు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించింది. దేశీయంగా ఢిల్లీ సహా  వివిధ ప్రాంతాల్లో 25 శాఖలున్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top