విద్యార్థి ప్రాణం తీసిన పబ్‌జీ?

Student Suicide For PubG Game - Sakshi

ఘంటసాల (అవనిగడ్డ): పరీక్షలు దగ్గర పడుతున్నందున సెల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌కు దూరంగా ఉండాలంటూ తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం గ్రామానికి చెందిన తమ్మనబోయిన భీమరాజు, విజయనాగిని దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీపక్‌సాయి (15) శ్రీకాకుళం హైస్కూల్‌లో పదో తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు కళ్యాణ్‌ ఇదే హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో దీపక్‌సాయి చాలాబాగా చదువుతూ ఉండేవాడు. అయితే సెల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌ను విపరీతంగా ఆడేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా అదే పనిలో ఉండేవాడు.

పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ వాడవద్దని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన దీపక్‌సాయి కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. భోజనం చేసి తిరిగి ట్యూషన్‌కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి హైస్కూల్‌ వెనుక నుంచి లోపలికి ప్రవేశించి ప్రాంగణంలోని స్టేజీ పక్కనే ఉన్న భవనం రెండో అంతస్తు పిల్లర్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. శనివారం ఉదయం హైస్కూల్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన ఆయా.. విద్యార్థి మృతదేహాన్ని చూసి భయంతో హెచ్‌ఎంకు, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ బి.వెంకటేశ్వరరావు, చల్లపల్లి సీఐ ఎంవీ నారాయణ, సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top