కళ్లెదుటే గల్లంతు

Student Missing in Canal in West Godavari - Sakshi

కాలువలో కొట్టుకుపోయిన యువతి

తల్లి, మరో కుమార్తెను రక్షించిన స్థానికులు

దుస్తులు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తూ ఘటన

పోడూరు: తల్లి కాలువలో దుస్తులు ఉతుకుతుండగా ఆమెకు సహాయం చేసేందుకు వచ్చిన కుమార్తె కొట్టుకుపోయి గల్లంతైన ఘటన ఇది. ఆమెను పట్టుకునేందుకు తల్లి, మరో కుమార్తె కాలువలో దిగడంతో వారు సైతం కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. ఈ ప్రమాదం గురువారం మార్టేరు శివారు కంకరపుంతరేవు ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మార్టేరుకు చెందిన పడాల యమునాదేవి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దుస్తులు ఉతికేందుకు ఇంటికి సమీపంలోని నరసాపురం ప్రధానకాలువ వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు భార్గవి(18), ప్రియ(17) కాలువ వద్దకు వెళ్లారు. తల్లి కాలువ రేవులో దుస్తులు ఉతుకుతుండగా బార్గవి, ప్రియ కాలువలోకి దిగారు. కాలువలో నీటిప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో భార్గవి ప్రమాదవశాత్తూ కాలువలో కొట్టుకుపోయింది. దీంతో ఆమె తల్లి యమునాదేవి, సోదరి ప్రియ ఆమెను పట్టుకునేందుకు మరింత లోపలికి దిగారు. వారు కూడా కాలువలో కొట్టుకుపోతూ దాదాపు 50 మీటర్ల దూరం వెళ్లేసరికి కాలువకు అవతలివైపు నరసాపురం–మార్టేరు స్టేట్‌హైవే పక్కన ఉన్న స్థానికులు చూసి యమునాదేవిని, ప్రియను రక్షించారు. అప్పటికే ప్రియ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాలువలో మునిగిపోయిన భార్గవి జాడ తెలియలేదు. స్థానికులు, బంధువులు, పోలీసులు కాలువ వెంబడి భార్గవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాన్వాయ్‌ వాహనాన్ని పంపిన మంత్రి శ్రీరంగనాథరాజు
రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తూర్పుపాలెంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఉండగా మార్టేరులో కాలువలో బాలిక గల్లంతైన సమాచారం ఆయనకు తెలిసింది. దీంతో ఆయన వెంటనే స్పందించి తన వెంట ఉన్న ఆచంట ఎస్సైను కాన్వాయ్‌ వాహనంతో ఘటనా ప్రదేశానికి వెళ్లి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఆచంట ఎస్సై రాజశేఖర్‌ తన సిబ్బందితో ఘటనా ప్రదేశానికి వెళ్లారు. అప్పటికి ప్రమాదం నుంచి బయటపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రియను కాన్వాయ్‌ వాహనంలో ఎస్సై రాజశేఖర్‌ హుటాహుటిన తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.

గ్రామంలో విషాదఛాయలు
పడాల భార్గవి కాలువలో గల్లంతవడంతో మార్టేరు శివారు కంకరపుంత రేవులో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్గవి పెనుగొండలోని ఎస్‌కేవీపీ కళాశాలలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఆ తరువాత దుస్తులు ఉతికేందుకు తల్లికి సాయంగా వెళ్లింది. అంతలోనే ఆమె కాలువలో గల్లంతయిందన్న వార్త స్థానికులను త్రీవంగా కలచివేసింది. భార్గవి తల్లి యమునాదేవి సాధారణ గృహిణి కాగా తండ్రి బులి రామకృష్ణ ఉపాధి నిమిత్తం కొద్దినెలల కొందటే దుబాయ్‌ వెళ్లాడు. వీరికి భార్గవి, ప్రియ ఇద్దరు కుమార్తెలు సంతానం. ప్రియ మార్టేరు ఎస్‌వీజీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డ తల్లి షాక్‌లో ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోతోంది. వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ కర్రి వేణుబాబు, గ్రామానికి చెందిన పలువురు నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top