‘నన్నే పెళ్లి చేసుకోవాలి’ అంటూ..

sexual harassment on rayalaseema university assistant professor - Sakshi

అధ్యాపకురాలిపై లైంగిక వేధింపులు

ఆర్‌యూలో కీచకులుగా మారిన సహచరులు

కర్నూలు (ఆర్‌యూ): విశ్వవిద్యాలయాలు నైతిక విలువలను పెంపొందించాల్సిన ఆలయాలు. అలాంటి విద్యాలయంలో అధ్యాపకులే నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నారు. తోటి అధ్యాపకురాలిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం ఈ విషయాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అవివాహితురాలైన ఆమె మెరిట్‌ మీద కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా గత జూలైలో ఆర్‌యూలో ఉద్యోగంలో చేరారు. ఆరు నెలలుగా ముగ్గురు తోటి కాంట్రాక్ట్‌ అధ్యాపకులే వివిధ రూపాల్లో లైగింక వేధింపులకు పాల్పడుతున్నారు. ‘నన్నే పెళ్లి చేసుకోవాలి’ అంటూ వేధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాధిత అధ్యాపకురాలు.. ఉద్యోగం వదలిపోతున్నట్టు సన్నిహితులతో చెప్పి వాపోయారు. ఈ విషయాన్ని వర్సిటీ ఉన్నతాధికారులకు చెప్పాలని, తాము కూడా తోడుంటామని వారు చెప్పారు. ఇందుకోసం సోమవారం ఆమె వెళుతుండగా.. దారిలోనే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వి‍ద్యార్థులు, అధ్యాపకులు ఆమెను కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు.

నిందితులపై గతంలోనూ ఆరోపణలు
అధ్యాపకురాలిని వేధించిన వారిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి.  దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా అందింది. అయినా చర్యలు తీసుకోలేదు. సంజాయిషీ కూడా కోరకపోవడంతో వీరు మరింత రెచ్చిపోయి.. అధ్యాపకురాలిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, వేధింపులు నిజమైతే బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top