హజీపూర్‌ వరుస హత్యలు.. సంచలన నిజాలు!

Sensational Facts in Hajipur serial Murders - Sakshi

ముగ్గురిని తానే చంపేసినట్టు అంగీకరించిన శ్రీనివాస్‌రెడ్డి

పోలీసుల విచారణ వెలుగులోకి వాస్తవాలు

సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల మిస్టరీకి సంబంధించి కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా విచారణలో తన దారుణాల గుట్టు విప్పాడు. శ్రావణి, మనీషా, కల్పన.. ఇలా ముగ్గురు విద్యార్థినులను తానే హత్య చేశానని, వారిపై కిరాతకంగా లైంగిక దాడులు జరిపి మరీ  చంపేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇరవై ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లి కాకపోవడంతో శ్రీనివాస్‌రెడ్డి సైకోగా మారిపోయాడని, అతనికి తరచూ పోర్న్‌ వెబ్‌సైట్లు చూసే అలవాటు ఉందని, ఈ క్రమంలో అమాయకులైన ఆడపిల్లలపై కన్నేసిన అతను.. రాక్షసుడిగా మారి.. అమ్మాయిలపై  అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

హాజీపూర్‌లో వెలుగుచూసిన మూడు హత్యలు తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు ఒకే బావిలో లభించగా.. నెలరోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు అమ్మాయిలను శ్రీనివాస్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పన(11)పై కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు నిందితుడు తాజాగా అంగీకరించాడు. దీంతో కల్పన మృతదేహం కోసం మరో బావిలో పోలీసులు వెతుకుతున్నారు. శ్రావణి, మనీషాను హత్య చేసి.. బావిలో విసిరేసినట్టే.. కల్పనను కూడా అదేవిధంగా మరో బావిలో విసిరేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టైన సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఇప్పటికే గ్రామస్తులు దాడి చేసి.. నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్‌రెడ్డి దారుణాల గురించి తెలుసుకున్న హాజీపూర్‌ వాసులు తీవ్ర ఆగ్రహావేశంతో అతడి ఇంటిని తగలపెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు. శ్రీనివాస్‌రెడ్డిని అత్యంత కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: వరుస హత్యలు.. హాజీపూర్‌లో టెన్షన్‌

శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top