నిశీ..నిద్ర..ముంచింది..!

RTC Bus And Lorry Accident In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌ గార్డెన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజాము మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మరో ఇద్దరు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ప్రత్యక్షసాక్షి బస్‌ కండక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్ర గడ్చిరౌలీ జిల్లాలోని ఐరీ బస్‌ డిపోకు చెందిన ఎమ్‌హెచ్‌ 29 బీఈ 1039 నంబర్‌ గల ఆర్టీసీ హైర్డ్‌ బస్సు గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరింది. రెబ్బెన దగ్గర టైర్‌ పంక్చర్‌ కావడంతో, అక్కడే రిపేరు చేయించుకొని మంచిర్యాల వైపు వస్తోంది. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌ గార్డెన్‌ దగ్గరికి రాగానే, మంచిర్యాల నుంచి పేపర్‌ లోడ్‌తో చంద్రాపూర్‌ వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీజీ 07 బీఎఫ్‌ 9216 నంబర్‌ గల లారీ ఎదరురెదురుగా ఢీకొన్నాయి.

ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ బల్లార్షకు చెందిన కమర్‌అమర్‌ చౌస్‌ (37)తోపాటు  ఆయన వెనుక సీట్లో కూరున్న పెద్దపెల్లి జిల్లా, పెద్దకల్వలకు చెందిన ప్రయాణికుడు కారంగుల ఎల్లయ్య (54) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సు కండక్టర్‌ సూర్యకాంత్‌ భగవన్మోరేతోపాటు మరో తోమ్మిది మంది మహారాష్ట్ర ప్రయాణికులు కూడా గాయాలపాలయ్యారు. లారీ డ్రైవర్‌ బిహార్‌ రాష్ట్రంలోని జమ్ముకు చెందిన డంబ్లు వక్లవ్, అదే రాష్ట్రంలోని అత్యవార్‌జుమ్లికి చెందిన లారీ క్లీనర్‌ సుధీర్‌ కుమార్‌ కూడా క్షతగాత్రుల్లో ఉన్నారు.

క్రేన్‌తో మృతదేహాల వెలికితీత..
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో డ్రైవర్, కండక్టర్లతో కలిపి 10 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్‌ కమర్‌అమర్‌ చౌస్‌తోపాటు అతని వెనుక సీట్లో కూర్చున్న ఎల్లన్న అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంపై స్థానికులు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో మంచిర్యాల ఎస్సైలు ఓంకార్‌యాదవ్, మారుతి, బ్లూ కోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సు క్యాబిన్‌లోనే చిక్కుకుపోయిన డ్రైవర్, ప్రయాణికుడి మృతదేహాలను బయటికి తీసేందు కు క్రేన్, జేసీబీని రప్పించాల్సి వచ్చింది. మృతదేహాలను వెలికితీతకు దాదాపు రెండు గంటలు పట్టింది. ప్రమాద వాహనాలు బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మృతిచెందిన బస్‌ డ్రైవర్‌ కమర్‌అమర్‌ చౌస్ 
బంధువులను చూసేందుకు వెళ్లి..
పెద్దపెల్లి జిల్లా పెద్దకల్వలకు చెందిన కారంగుల ఎల్లయ్య మహారాష్ట్ర చంద్రపూర్‌లోని ఓ ప్రైవేటు కంపనిలో మెకానిక్‌గా పని చేస్తూ కొన్నేళ్ల కిందటే అక్కడ స్థిరపడ్డాడు. సొంత గ్రామంలోని బందువులకు చూసేందుకు వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాతపడ్డాడు. ఎల్లయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ రోడ్డు ప్రమాదం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో జరగడంతో అతి నిద్రే ప్రమాద కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా వాహనాల అతివేగం, ఇరుకు రోడ్డు కూడా కారణం కావొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రయాణికుడు ఎల్లయ్య

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top