సిగ్నల్‌పోల్‌ను ఢీకొట్టిన కారు

Road Accident In Prakasam - Sakshi

వాహనదారు, కొడుకు, సోదరి మృతి

ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్య

నిద్రమత్తే వారి పాలిట శాపం

సాక్షి ,సింగరాయకొండ (ప్రకాశం): దైవదర్శనానికి వెళ్లి వస్తున్న ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిగ్నల్‌ పోల్‌ను వేగంగా వచ్చి ఢీ కొనడంతో రెండు, మూడు ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున సుమారు ఒంటిగంట సమయంలో జాతీయరహదారిపై సింగరాయకొండ మండలం కనుమళ్ల జంక్షన్‌ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నంనకు చెందిన కందరపు రామకృష్ణ (54) అక్కడే జాగృతి కో ఆపరేటివ్‌ సొసైటిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని బావ రాజమండ్రికి చెందిన కొత్తపల్లి రమేష్‌ రెండు కుటుంబాల వారు వేర్వేరు కార్లలో గత నెల 28వ తేదీ బయలుదేరి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు.

మంగళవారం తిరుగుప్రయాణంలో కారును స్వయంగా నడుపుతున్న రామకృష్ణ కనుమళ్ల జంక్షన్‌ వద్దకు రాగానే నిద్రమత్తులో తూగటంతో కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోని సిగ్నల్‌ పోల్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు రోడ్డుపై రెండు, మూడు ఫల్టీలు కొట్టడంతో ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదంలో రామకృష్ణ సంఘటన స్థలంలోనే మృతిచెందగా, కారులో ఉన్న అతని కుమారుడు సత్యకృష్ణ విశ్వజ్ఞ (16), అతని సోదరి కొత్తపల్లి విజయ (55), భార్య సుజాత తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే 108లో మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సత్యకృష్ణ విశ్వజ్ఞ, విజయలు మరణించారు. సుజాత పరిస్థితి విషమంగా ఉంది. అయితే రామకృష్ణ కారు ముందు వెళ్తుండగా అతని బావ రమేష్, మరికొందరు బంధువులు వెనుక కారులో వస్తున్నారు.

కళ్లముందే సంఘటన 
తమ కళ్లముందే ముందు వెళ్తున్న కారు బోల్తా కొట్టడంతో వెనకాల కారులో వస్తున్న బావ రమేష్‌ తీవ్రంగా తల్లడిల్లిపోయారు. తరువాత కారు వద్దకు వచ్చి గాయపడ్డ తన భార్య విజయను ఒళ్లో పడుకోబెట్టుకుని ఆమెకు సపర్యలు చేశారు. ఈ సమయంలో ఆమె తీవ్ర ఆయాసానికి గురవడంతో 108 సిబ్బంది వైద్యసేవలు అందించి ఆస్పత్రికి తరలించారు. రమేష్‌ కెనరాబ్యాంకు ఏజీఎంగా రాజమండ్రిలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్, ఎస్‌. పులి రాజేష్‌లు పరిశీలించారు. తరువాత బుధవారం ఉదయం రిమ్స్‌లో మార్చురీకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు రిజిష్టరు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top