దూసుకొచ్చిన మృత్యువు

Mother And Daughter Died in Lorry Accident Prakasam - Sakshi

హైవేపై పెళ్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బైక్‌ను ఢీకొన్న లారీ

తల్లీకూతుళ్లు అక్కడికక్కడే దుర్మరణం

కొడుకును చూసేందుకు వెళ్తూ.. అనంత లోకాలకు..

తండ్రికి తీవ్ర గాయాలు

ఒంగోలు: ఇంకాసేపట్లో కొడుకు దగ్గరకు చేరతారనుకున్న వారి జీవితాలను హైవేపై దూసుకొచ్చిన మృత్యు శకటం ఛిద్రం చేసింది. భార్య, కుమార్తెతో కలిసి ఒంగోలులో చదువుతున్న పెద్ద కొడుకును చూసేందుకు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో తల్లీ, కుమార్తె అక్కడికక్కడే దుర్మరణం చెందగా..తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జాతీయ రహదారిపై పెళ్లూరు వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కందుకూరు డి.వి.వారిపాలేనికి చెందిన దూదిపల్లి పూర్ణచంద్రరావు ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నాడు. భార్య విజయ కందుకూరు గురుదత్త పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఏడాదిగా అందులో పనిచేస్తోంది. వారికి ఇద్దరు సంతానం. కొడుకు లింగయ్య నాయుడు పేర్నమిట్ట గురుదత్త హైస్కూలులో 8వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె శ్రీవిద్య తల్లిదండ్రుల వద్దే ఉంటూ కందుకూరు గురుదత్తలో నాలుగో తరగతి చదువుతోంది.

ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు కావడంతో కుమారుడిని చూసొద్దామని భార్య, భర్త కుమార్తెతో కలిసి మోటారు బైక్‌పై బయల్దేరారు. ఉదయం 11 గంటల సమయంలో పెళ్లూరు హైవేపైకి వచ్చేసరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో భార్య విజయ (33), ఆమె కుమార్తె శ్రీవిద్య (9) ఇద్దరూ కిందపడిపోయారు. బైక్‌ అదుపుతప్పడంతో పూర్ణచంద్రరావు పదడుగుల దూరంలో పడిపోయాడు. విజయ తలమీదుగా లారీ వెళ్లిపోవడంతో తల నుజ్జు నుజ్జయి ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తల్లితో పాటు బండిమీద నుంచి కిందపడిపోయిన శ్రీవిద్య మొహం రోడ్డుకు బలంగా గుద్దుకోవడంతో ఆమె ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి. మోకాళ్లపై కూర్చున్న పాప కూర్చున్నట్లుగానే తల్లి వైపు మొహం పెట్టి ఉండగా..తలభాగం నుంచి రక్తం ధారలుగా కారుతుండటం చూసిన వారి కళ్లు చెమర్చాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే 108కు సమాచారం అందించి పూర్ణచంద్రరావును ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

ఆద్యంతం కన్నీటి పర్యంతం:  ప్రమాద వార్త తెలుసుకున్న విజయ సోదరుడు బాలకృష్ణ సింగరాయకొండ నుంచి హుటాహుటిన పెళ్లూరు హైవే వద్దకు వచ్చారు. చెల్లెలు తలభాగం ముక్కలు ముక్కలైన దృశ్యం చూసి తట్టుకోలేకపోయాడు. మరో వైపు మేనకోడలు పడి ఉన్న తీరు చూసి పాపను పట్టుకుని భోరుమన్నాడు. పోలీసులు మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. బాలకృష్ణ రిమ్స్‌కు చేరుకుని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బావ పూర్ణచంద్రరావు పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. దుర్ఘటన గురించి తెలియడంతోలింగయ్య నాయుడును వెంట తీసుకుని గురుదత్త హైస్కూలు కరస్పాండెంట్‌ నల్లూరి వెంకటేశ్వర్లు రిమ్స్‌కు వచ్చారు. తనను చూసేందుకు వస్తూ తల్లి, చెల్లెలు మృతిచెందారని తెలుసుకుని చిన్నారి కన్నీటి పర్యంతమయ్యాడు. వారి బంధువులు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాలను చూసి విలపించారు. ఒంగోలు తాలూకా సీఐ యం.లక్ష్మణ్, ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.  ప్రమాద స్థలం నుంచి అదృశ్యమైన లారీని గుర్తించేందుకు హైవేపై ఉన్న టోల్‌గేట్ల వద్ద, జాతీయ రహదారిపై, చీరాల మార్గంలో ఉన్న పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. ఒంగోలు ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

డి.వి.పాలెంలో విషాద ఛాయలు
కందుకూరు: పట్టణ సమీపంలోని డి.వి.పాలెం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద  రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులది దివివారిపాలెం గ్రామం. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే పూర్ణచంద్రరావు ప్రతి రోజు భార్యను, కుమార్తెను స్కూల్‌ వద్ద వదిలి తాను పనికి వెళ్లేవాడని, తిరిగి సాయంత్రం తానే స్వయంగా తీసుకొచ్చేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక తమ స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయిని, విద్యార్థిని మృతితో స్కూల్‌లోనూ విషాదం నెలకొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top