బిగుస్తున్న ఉచ్చు..!

Revenue Department Focus on Government Lands Mahabubnagar - Sakshi

ఊట్కూరు మండలంలో ముగ్గురు వీఆర్‌ఏల సస్పెన్షన్‌

నేడు ఓ వీఆర్వోపై వేటు పడే అవకాశం?

పైస్థాయి అధికారుల పాత్రపై కలెక్టర్‌ ఆరా?

మరో 75 ఎకరాల సర్కారు భూమి అన్యాక్రాంతంపై విచారణ

అక్రమార్కుల గుండెల్లో గుబులు

చర్చనీయాంశమవుతున్న ‘సాక్షి’ కథనాలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ ఊట్కూరు: ఎట్టకేలకు... రెవెన్యూలో అవినీతి ఉద్యోగుల ఆట కట్టయింది. ప్రభుత్వ భూములను తమ కుటుంబీకులు, బంధువుల పేర్ల మీద పట్టా చేసుకున్న నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలానికి చెందిన ముగ్గురు వీఆర్‌ఏలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఓ వీఆర్వోపై మంగళవారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సర్కారు భూములను కాపాడాల్సిన ఉద్యోగులే వాటిని కబ్జా చేసిన తీరుపై ఈ నెల ఎనిమిదో తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘సర్కారు భూమికి ఎసరు?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి ఊట్కూర్‌ వీఆర్వో భీమయ్య, వీఆర్‌ఏ రాజప్ప, భీంరావు, బాపూర్‌ వీఆర్‌ఏ జ్యోతిలను సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వీఆర్‌ఏలను తహసీల్దార్‌ దానయ్య సస్పెండ్‌ ఉత్తర్వులు జారీ చేయగా.. వీఆర్వో భీమయ్యపై నివేదికను సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపారు. ఆయన్ను కలెక్టర్‌ మంగళవారం సస్పెండ్‌ చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఊట్కూర్‌ శివారులోని సర్వే నం. 708/2, 3–11 ఎకరాలు, సర్వే నం. 194అ లో 1–12 గుంటలు, సర్వే నం. 702అ లో ఎకరం, సర్వే నం. 703/2లో 3–38 ఎకరాలు, దంతన్‌పల్లి శివారులోని సర్వే నం.189/ఉ,, సర్వే నం.  189/ఊ, రెండెకరాల చొప్పున, బాపూర్‌ గ్రామ శివారులోని సర్వే నం. 30/ఎఅ లో ఐదెకరాలు మొత్తం 21.81ఎకరాలనుతమ కుటుంబీకుల పేరిట పట్టా చేసుకున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై విచారణ జరిపిన తహసీల్దార్‌ దానయ్య అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. నివేదికను కలెక్టర్‌ను పంపడంతో ఆమె నలుగురు రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశింశారు.

పాత్రధారులా? సూత్రధారులా?
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపులపై ‘సాక్షి’ వరుస కథనాలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నెల 8న ‘సర్కారు భూమికి ఎసరు?’ శీర్షికతో 21.81 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై కథనం ప్రచురించగా.. 10వ తేదీన ‘భూ మాయ’ శీర్షికతో అదే మండలంలో మరో 75 ఎకరా ల ప్రభుత్వ స్థలం బయటి వ్యక్తులకు అక్రమంగా ప ట్టా చేసిన ఉదంతంపై కథనం ప్రచురించింది. కథనా లపై స్పందించిన కలెక్టర్‌ హరిచందన దాసరి.. అక్రమాల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుత ఉద్యోగాల్లో కొనసాగుతూ ప్రభుత్వ భూ ముల్నే కాజేసిన సిబ్బందిపై వేటు వేశారు. అలాగే.. అక్రమ పట్టాలు సృష్టించి ఇతరులకు 75 ఎకరాలు ధారాదత్తం చేసిన ఉద్యోగులపైనా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ అక్రమ వ్యవహారంలో వేటు పడ్డ ఉద్యోగులు కేవలం పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు పైస్థాయి అధికారులేననే చర్చ ఉమ్మడి జిల్లాలోనే హాట్‌టాపిక్‌గా మారింది. పైస్థాయి అధికారుల ప్రమేయం లే కుండా భూ అక్రమం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట పట్టాలుగా మారినా పైస్థాయి అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ జరిపించిన అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించిన ట్లు ప్రచా రం జరుగుతోంది. తాజాగా ఇటీవల నూత న బాధ్య తలు చేపట్టిన కలెక్టర్‌ హరిచందన ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. దీంతో అక్రమ పట్టాల విషయంలో సమగ్ర విచారణ జరిపించి సస్పెండ్‌ అయిన ఉద్యోగులకు అండగా నిలిచిన అధికారులపైనా వేటు వేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

సమగ్ర సర్వే చేపడతాం..
మండలంలో ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలో ఇతరుల పేరిట పట్టాలుగా మారాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ముగ్గురు వీఆర్‌ఏలను సస్పెండ్‌ చేశాను. ఓ వీఆర్వో అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపాను. మండలంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే చేస్తాం. అక్రమ పట్టా, రైతుబంధుతో లబ్ధిపొందిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. – దానయ్య, తహసీల్దార్, ఊట్కూరు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top