ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్య తేజకు రిమాండ్‌

Remand to Surya Teja in Jhansi suicide case - Sakshi

హైదరాబాద్‌: టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు మద్దాల సూర్య తేజ (30)ని మంగళవారం పంజగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వివాహం చేసుకుంటానని నమ్మక ద్రోహం చేయడం 306, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తన సర్వస్వం సూర్యనే అనుకున్న ఝాన్సీ తన ప్రాణమైన నటనకు కూడా దూరమైంది. సూర్య మాత్రం ఆమెపై అనుమానం వ్యక్తం చే స్తూ తరచూ గొడవలు పెట్టుకునేవాడని విచారణలో తెలిసింది. ఆమె ఫోన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు సూర్య ఇంట్లో వేరే సంబంధాలు చూడటంతో నాగ ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురయినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునే ముందు కూడా ఝాన్సీ ఫోన్‌ చేస్తే అతను స్పందించనట్లు తెలిసింది.  

తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ... 
గత ఏప్రిల్‌లో ఇద్దరికీ పరిచయం కాగా, జూన్‌లో ఒకరికొకరు ప్రపోజ్‌ చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలో వివాహం చేసుకుంటామని జూలైలో ఝాన్సీ ఇంట్లో కూడా చెప్పారని తెలిపారు. ఆ తర్వాత సూర్య ఇంటికి వెళ్లి ఝాన్సీ వారం రోజులు అక్కడే ఉందన్నారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌లో ఝాన్సీ కొంత డబ్బు అతనికి ఇచ్చిందని, దాంతో బైక్‌ కొనుగోలు చేశారని తెలిపారు. అప్పటి వరకు బాగానే ఉండగా అనంతరం ఇద్దరి మధ్యా చిన్న గొడవలు ప్రారంభమయ్యాయన్నారు. ఝాన్సీ నటించడం, వేరేవారితో మాట్లాడటం సూర్యకు నచ్చేది కాదని, దీంతో ఆమె నటన కూడా మానేసిందని తెలిపారు.

ఈ క్రమంలో జనవరి నుంచి సూర్యకు ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారని తెలియడంతో ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. ఆత్మహత్య చేసుకునే రెండు రోజుల ముందు నుంచి సూర్యతో మాట్లాడలేదని, కాని ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఫోన్‌ చేయగా అతను స్పందించలేదన్నారు. మెసేజ్‌లు పెట్టినా అప్పుడు సూర్య ఫోన్‌లో నెట్‌ ఆఫ్‌ చేసి ఉండటంతో అతను అవి చూసుకోలేదని, తర్వాత నెట్‌ ఆన్‌ చేసినా ఝాన్సీ ఆ మెసేజ్‌లను డెలీట్‌ చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత సూర్య పలు మెసేజ్‌లు పెట్టినా ఆమె నుంచి స్పందన రాలేదని వివరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top