'మహానగరాల కంటే ఇక్కడ బంగారం ధర తక్కువ'

In Proddatur Gold Is Cheaper Than Other Metropolitan Cities - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : బెంగళూరుకు చెందిన రతన్‌సింగ్‌ అనే బంగారు వ్యాపారి సూట్‌కేసులో సుమారు 2.2 కిలోల బంగారు నగలను ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చాడు. మైదుకూరు రోడ్డులో వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటపడి  పట్టుకున్నారు. పోలీసు అధికారులు ప్రశ్నించగా తన పేరు రతన్‌సింగ్‌ అని, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలిపాడు. తరచూ ప్రొద్దుటూరు, కడపలోని దుకాణాల్లో బంగారు నగలను విక్రయిస్తున్నానని చెప్పాడు. బిల్లులు చూపించమని అడగ్గా తెల్లముఖం వేశాడు. పోలీసులు నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను పోలీసులు కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పగించారు.
 
బంగారం కేసు ఐటీకి అప్పగింత
కడప అర్బన్‌: కడపలో ఈనెల 21న కారులో బయట పడిన బంగారు ఆభరణాల కేసును పోలీసులు ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. కడప అర్బన్‌ సీఐ ఎస్‌కెఎం ఆలీ శుక్రవారం ఈ విషయం తెలిపారు.  కడప నగరంలో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు వెనుకసీటులో రహస్యంగా బాక్స్‌ను ఏర్పాటు చేసుకుని రూ.3 కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరు పట్టణంలోని మౌనిక జ్యుయెలర్స్‌ పేరుతో ఉన్న  బిల్లులను మాత్రం కారులోని ముగ్గురు వ్యక్తులు చూపించారు. ఆదాయపన్నుకు సంబంధించిన వ్యవహారం కావడంతో బంగారాన్ని పోలీసులు సీజ్‌ చేసి కేసు విచారణ బాధ్యతలను తిరుపతిలోని ఆదాయపన్ను శాఖ ఏడీ రాజారావుకు అప్పగించారు.
►కొన్ని రోజుల క్రితం చెన్నై నుంచి సుమారు 3 కిలోల బంగారు నగలను తీసుకు వస్తున్న వారిని ఎర్రగుంట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బిల్లులు లేకపోవడంతో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పగించారు.
►కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరుకు చెందిన ముకుందరాజన్‌ అనే వ్యాపారి నుంచి నలుగురు వ్యక్తులు పోలీసు వేషంలో వచ్చి టోకరా వేశారు. రూ.21 లక్షల విలువైన బంగారం దోపిడీ చేశారు. వ్యాపారి కోయంబత్తూరు నుంచి జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రొద్దుటూరుకు బయలుదేరగా పోలీసు దుస్తుల్లో రైలు ఎక్కి వ్యాపారి బ్యాగులను తనిఖీ చేశారు. బంగారు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని రెండు మొబైల్‌ ఫోన్లు, చేతిలో బంగారు నగల బ్యాగును లాక్కొని వెళ్లారు.. ఇలాంటి ఉదంతాలు ప్రొద్దుటూరు బంగారు వ్యాపారంలో చాలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పసిడి వ్యాపారానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. రాష్ట్రంలో ఎక్కడ బంగారం పట్టుబడ్డా ప్రొద్దుటూరుకు ముడిపడి ఉంటుంది. తులం, రెండు తులాలు కాదు  ఎక్కడ బంగారం పట్టుబడ్డా కేజీల్లోనే ఉంటుంది. 

 కడపలో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు(ఫైల్‌)

చెన్నై, కోయంబత్తూరు నుంచి..
గతంలో ప్రొద్దుటూరులోని బంగారు వ్యాపారులు నగలను తయారు చేయాలంటే స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు ఇచ్చేవారు. నగలకు కావలసినంత బంగారు వ్యాపారులే ఇచ్చి కోరిన డిజైన్లు చేయించుకునే వారు. స్థానికంగా వ్యాపారాలు బాగుండటంతో స్వర్ణకారులు కూడా పెద్ద ఎత్తున వెలిశారు. 10 ఏళ్ల నుంచి పరిస్థితి మారిపోయింది. ప్రొద్దుటూరు మార్కెట్‌లోకి చెన్నై, సేలం, కోయంబత్తూరు, ముంబైకి చెందిన వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. ఇక్కడి వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకొని నగల తయారీకి ఆర్డర్లు తీసుకెళ్లడం ప్రారంభించారు. దీంతో స్థానికంగా స్వర్ణకారులకు పూర్తిగా పని తగ్గిపోయింది. బంగారు వ్యాపారులకు కావలసిన నగల మోడళ్లను వాట్సప్‌ ద్వారా పంపించి కిలోల్లో నగలను తెప్పించుకుంటున్నారు. వీళ్లు తెచ్చే బంగారానికి బిల్లులు లేకపోవడంతో ఆన్‌లైన్‌ ధర కంటే తక్కువకే ప్రొద్దుటూరులో విక్రయిస్తుంటారు. 

కొంత సరుక్కే బిల్లులు
ఇతర రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరు, కడపకు వారంలో రెండు రోజులు బంగారు వస్తుంటుంది. వీరు నిత్యం ఒకే మార్గంలో కాకుండా రైలు, బస్సుల్లో, కార్లలో వస్తుంటారు. వ్యాపారులు ఎప్పుడు జిల్లాకు వచ్చినా మూడు నాలుగు కిలోలకు మించి బంగారంతో వస్తారు. మరీ ఆర్డర్లు ఎక్కువైతే ఇద్దరు వ్యాపారులు కలిసి వేరు వేరుగా వస్తారు. వీరి వద్ద సగం బంగారానికి సరిపడా బిల్లులు మాత్రమే ఉంటాయి.  పోలీసులకు పట్టుబడితే సురక్షితంగా బయట పడేందుకు ముందుగానే స్థానిక వ్యాపారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు.  పట్టుబడిన వెంటనే ఆలస్యం కాకుండా సేల్స్‌ ట్యాక్స్‌ అధికారులకు బంగారాన్ని అప్పగించేలా వ్యవహారం నడిపిస్తారు. ఉన్న బిల్లులతో పాటు స్థానికంగా ఉన్న వ్యాపారుల  నుంచి మిగతా బంగారానికి సరిపడా బిల్లులు తెప్పించుకుంటారు. ఇలా పట్టుబడినప్పుడు ఆ బంగారం తమదే అని ..ఇక్కడి ఐటీ   రిటర్న్స్‌ దాఖలు చేసే కొందరు వ్యాపారాలు ఆ భారాన్ని తమపై వేసుకుంటారు. ఇలా బయటి రాష్ట్రాల వ్యాపారులు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా సురక్షితంగా తప్పించుకుంటున్నారు.
 
అధికారులకూ తెలుసు!
పెద్ద ఎత్తున బంగారం పట్టుబడినప్పుడు ఎలా బయట పడాలనే చిట్కాలను కొందరు అధికారులు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమ, గురువారాల్లో ఎక్కువగా బయటి రాష్ట్రాల వ్యాపారులు ప్రొద్దుటూరుకు వస్తుంటారు. నగలను డెలివరీ చేసి, ఒకటి, రెండు రోజుల పాటు జిల్లాలోనే మకాం వేసి తిరిగి ఆర్డర్లు తీసుకొని వెళ్తుంటారు. బిల్లులు లేకుండా విక్రయాలు చేస్తుండటంతో ముంబై, హైదరాబాద్‌ తదితర మహానగరాల కంటే ప్రొద్దుటూరులో బంగారం తక్కువ ధరకు దొరుకుతుంది. ప్రొద్దుటూరు, కడపలో అన్ని రకాలుగా అనుమతులు పొంది దుకాణాలు నిర్వహించుకునే వ్యాపారులు చాలా మంది ఉన్నారు. కొందరు పెద్ద మొత్తంలో బంగారు కొనుగోలు చేస్తున్న ప్రజలు పాన్, ఆధార్‌ కార్డులు లేకుండా కావాలని అడుగుతుండటంతో బిల్లుల్లో చూపని బంగారును వారికి విక్రయిస్తున్నారు. బిల్లులు లేకుంటే రేటు తగ్గుతుందనే ఉద్దేశంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సకాలంలో ట్యాక్స్‌ చెల్లించే వ్యాపారులు ధరలు తగ్గించలేక ఇబ్బందులు పడుతున్నారు.
 
సౌదీ అరేబియా, కువైట్‌ నుంచి కూడా..
సౌదీ అరేబియా, కువైట్‌ల నుంచి ప్రొద్దుటూరుకు బంగారు బిస్కెట్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా కొందరు వ్యాపారులకు అక్కడి వారితో సంబంధాలు ఉన్నాయి. వీరు తరచు బంగారు బిస్కెట్‌లను పంపుతున్నట్లు సమాచారం. పెద్ద పెద్ద విమానాశ్రయాల్లో తనిఖీలు ఎక్కువగా ఉంటాయని చెన్నై లాంటి ఎయిర్‌పోర్టుల ద్వారా పంపిస్తున్నారు. జీవనోపాధి కోసం వెళ్లి ఇండియాకు వస్తున్న జిల్లా వాసుల ద్వారా కూడా బంగారాన్ని పంపిస్తున్నారు. వారు చెన్నై విమానాశ్రయాల్లో దిగగానే అక్కడే ఉన్న  వ్యాపారులు బంగారం తీసుకుంటున్నారు. ఇందుకు గాను  వారికి కమీషన్‌ కూడా ఇస్తున్నారు. ఇలా కూడా ప్రొద్దుటూరుకు పెద్ద ఎత్తున బంగారు వస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top