విక్రయించేందుకే బాలుడి కిడ్నాప్‌..

Police Solve Kidnap Case In Warangal - Sakshi

సాక్షి, రామన్నపేట: ఎంజీఎం ఆస్పత్రి పిడియాట్రీక్‌ ఓపీ విభాగంలో గత నెల 31వ తేదీన ఏడేళ్ల బాలుడు యశ్వంత్‌ను విక్రయించేందుకే పథకం ప్రకారం కిడ్నాప్‌ చేశారని వరంగల్‌ ఏసీపీ నర్సయ్య పేర్కొన్నారు. నలుగురు కిడ్నాప్‌ ముఠా  సభ్యులను అరెస్టు చేసిన అనంతరం గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బాలుడి కిడ్నాప్‌ కేసులో టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సివిల్‌ పోలీసులు  బృం దాలుగా ఏర్పడి కేసును ఛేదించినట్లు ఏసీపీ తెలిపారు. సీసీ పుటేజ్‌లు కేసులో కీలకమైనాయన్నారు. ఆగస్టు 31న ఖిలావరంగల్‌కు చెందిన పెద్దోజు జ్యోతి తన చిన్నకుమారుడు జశ్వంత్‌ జ్వరంతో బాధపడుతుండగా ఎంజీ ఎం ఆస్పత్రి ఓపీ విభాగానికి తీసుకొచ్చింది. ఈ క్రమంలో పెద్ద కుమారుడు యశ్వంత్‌(7)ను ఓపీ విభాగంలో బల్లపై ఉంచి వైద్యుల వద్దకు వెళ్లింది. వచ్చి చూసేసరికి యశ్వంత్‌ కనిపించలేదు.

చుట్టుపక్కల వెతికినా కన్పించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు కి డ్నాప్‌ జరిగిన రోజు ఎం జీఎం ఆస్పత్రిలోని సీసీ పుటేజీలను పరిశీ లించగా  ఓ మహిళ బాలుడి ని బలవంతంగా ఎత్తుకుని ఎంజీఎం చౌరస్తా వైపునకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. పుటేజీల ఆధారంగా పోలీసు బృందాలు అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. ఈ క్రమంలో బాలుడిని ముఠా సభ్యులు వరంగల్‌ హెడ్‌పోస్టాఫీసు దగ్గర వదిలి వెళ్లగా బంధువుల సాయంతో బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో సంగెం మండలం కాట్రపల్లికి చెందిన అరుణ, రామస్వామి, మొండ్రాయి చెందిన సునీత, శ్రీనివాస్‌ లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే సునీత అనే మహిళ సీకెఎం ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుందన్నారు. కిడ్నాప్‌ చేసిన బాలుడిని రూ. 2.50 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలి పారు. కిడ్నాప్‌ కేసును ఛేదించిన సీఐ జీవన్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్‌ సీఐ రమేశ్, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని సీపీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top