ప్రేమికుల కారును వెంబడించిన బంధువులు

one killed in road accident - Sakshi

వేగంగా వెళ్తూ.. చెట్టుకు ఢీ

ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు 

ఖమ్మం అర్బన్‌: ప్రేమికులు ముందు కారులో వెళ్తుండగా.. వెనుక అమ్మాయి తరఫున బంధువులు వెంటాడటం.. చాలా సినిమాల్లో కనిపించే దృశ్యమే. ఇలాంటి సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు– కొత్తగూడెం రోడ్డులో శనివారం చోటు చేసుకోగా.. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొని కారు డ్రైవర్‌ మృతి చెందాడు. ప్రేమికులతో పాటు స్నేహితుడికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని ఇల్లెందుకు చెందిన శ్రీపతి సుమన్‌ గాంధీ వాటర్‌ సప్లయ్‌ వ్యాపారం చేస్తున్నాడు. డిగ్రీ చదివే ఎండీ శహనా.. సుమన్‌ గాంధీ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో స్నేహితుల సహాయంతో వీరిద్దరు మహబూబాబాద్‌ జిల్లా అనంతారంలో వివాహం చేసుకున్నారు. శనివారం ఇల్లెందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించారు.

తమ కుటుంబసభ్యుల నుంచి హాని ఉందని భావించిన వీరు అద్దెకారులో హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. స్నేహితులు తరుణ్, రవితో కలసి కొత్తగూడెం వైపు బయలు దేరారు. గమనించిన çశహనా కుటుంబ సభ్యులు మరో కారులో వీరి కారును వెంబడించారు. సినిమాల్లో ఛేజింగ్‌ సీన్‌ను తలపించేలా రెండు కార్లు వేగంగా కొత్తగూడెం వైపు దూసుకువెళ్లాయి. ఈ క్రమంలో వెనుక నుంచి ప్రేమికులు వెళ్తున్న కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. దీంతో డ్రైవర్‌ టేకులపల్లికి చెందిన ఎం. రాజు(23) కారును పక్కకు మళ్లించగా, వేగంగా వెళ్తూ చెట్టును ఢీ కొట్టింది. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో సుమన్‌ గాంధీ, శహనా, తరుణ్, ముత్యాల రవిలు తీవ్రంగా గాయపడ్డారు.   ఇందులో తరుణ్‌ పరిస్థితి విషమంగా ఉంది.      పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top