అప్పు తీర్చనందుకే హత్య

Nirmal District Murder Case - Sakshi

వీడిన తల– మొండెం కేసు మిస్టరీ

సెల్‌ఫోన్‌ ఆధారంగా నిందితుడి అరెస్టు

వివరాలు వెల్లడించిన ఎస్పీ శశిధర్‌రాజు

నిర్మల్‌రూరల్‌ : గత నెలలో సంచలనం సృష్టించిన తల–మొండెం హత్య కేసు వీడింది. ఏప్రిల్‌ 9న భైంసా పట్టణంలో గుర్తు తెలియని తల, 11న నిర్మల్‌ జిల్లా కేంద్రంలో బుధవార్‌పేట్‌ సమీపంలోని ఓ ఇంట్లో మొండెం లభించడం కలకలంరేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్య కేసును చేధించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శశిధర్‌రాజు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చౌదరి మహ్మద్‌ ఇస్రార్‌(30), సయ్యద్‌ అక్తర్‌ కొన్ని రోజుల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చి రెడీమేడ్‌ బట్టల వ్యాపారం చేసేవారు. బుధవార్‌పేట సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు.

రూ.25 వేల కోసం హత్య..

ఇస్రార్, అక్తర్‌ బట్టల వ్యాపారం చేసే క్రమంలో ఇస్రార్‌ అక్తర్‌కు గతంలో రూ. 25వేలు అప్పు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ డబ్బుల కోసం ఎన్నిసార్లు అడిగినా అక్తర్‌ ఇవ్వలేదు. అయితే ఏప్రిల్‌ 8న రాత్రి ఈ డబ్బుల విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తన డబ్బులు చెల్లించమని ఇస్రార్‌ అక్తర్‌తో వాగ్వాదానికి దిగి దుర్భషలాడాడు. దీంతో కోపానికి గురైన అక్తర్‌ ఇస్రార్‌పై బండరాయితో కొట్టగా తీవ్ర గాయాలైన ఇస్రార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆందోళన చెందిన అక్తర్‌ సాక్షాన్ని కప్పిపుచ్చేందుకు, నేరాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇస్రార్‌ తల, మొండెంను కత్తితో వేరు చేశాడు. తలను ఓ గోనె సంచిలో పెట్టి భైంసాకు బస్సులో వెళ్లి అక్కడ ప్రభుత్వాస్పత్రి ప్రహరీ గోడ వద్ద పడేశాడు. తిరిగి నిర్మల్‌కు వచ్చి తన గదిలో ఉన్న మొండెంను బాత్‌రూంలోకి తీసుకెళ్లి దానిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. కానీ అది సరిగా కాలలేదు. అనంతరం అక్తర్‌ ఇస్రార్‌ సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారీ అయ్యాడు.
నిందితుడిని పట్టించిన సెల్‌ఫోన్‌..

హత్య కేసును నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలుగా వీడిపోయి అనుమానితుడు అక్తర్‌ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. మృతుడు అస్రార్‌ మొబైల్‌పై కూడా నిఘా పెట్టారు. గురువారం సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అక్తర్‌ మిర్యాలగూడలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డీఎస్పీ మనోహర్‌రెడ్డి అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడు అక్తర్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం పట్టణ సీఐ జాన్‌దివాకర్, ఇతర పోలీసు బృందం అక్తర్‌ను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చినట్లు వివరించారు. కేసు చేధనలో ముఖ్య పాత్రపోషించిన డీఎస్పీ మనోహర్‌రెడ్డి, పట్టణ సీఐ జాన్‌దివాకర్, ఎస్సై నర్సారెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ భోజగౌడ్, సిబ్బంది మురాద్‌ అలీ, రీయాజ్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. ఇందులో ఏఎస్పీ దక్షిణమూర్తి, డీఎస్పీ మనోహర్‌రెడ్డి, పట్టణ సీఐ జాన్‌ జాన్‌దివాకర్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top