వైద్యం అందక చిన్నారి మృతి

Newborn Baby Died For Hospital Negligence In Manchiryal - Sakshi

సాక్షి, మంచిర్యాల : వైద్యుడి నిర్లక్ష్యంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు నెలల చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ అంబేద్కర్‌కాలనీకి చెందిన ఎల్కపెల్లి మల్లేష్, తరుణి దంపతుల తొలి సంతానం సాయి మనస్విని (నాలుగు నెలలు). పుట్టినప్పటి నుంచి జిల్లాకేంద్రంలోని హర్షిత పిల్లల ఆసుపత్రిలో చూపిస్తున్నారు. మనస్వినికి శ్వాస రాకపోవడంతో మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు పాప ముక్కులో రెండుచుక్కలు మందు వేశారు.

మరో ఇద్దరు సీనియర్‌ వైద్యులు కూడా పరిశీలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో మనస్విని మృతి చెందింది. అయితే చిన్నారి మృతికి ఆసుపత్రి వైద్యుడు గోలి పూర్ణచందర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు బంధువులతో కలిసి ఆస్పత్రి ఎందుట ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. అప్పటికే రాత్రికావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏసీపీ గౌస్‌బాబ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 20మంది సిబ్బంది బందోబస్తు చేపట్టారు. 

కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌
పాప మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొంటూ బంధువులు ఆందోళన కొనసాగించారు. సంఘటన స్థలానికి ఐఎంఏ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు చేరుకొని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. బంధువులు రూ.10 లక్షలు డిమాండ్‌ చేయగా.. చివరకు రూ.2.50లక్షలు ఇచ్చేందుకు వైద్యుడు అంగీకరించారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. 

తప్పు లేకున్నా.. ఆందోళన
పాపను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే జలుబు, జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి శ్వాస ఆడడం లేదని మళ్లీ వచ్చారు. అప్పటికే బేబీ కండిషన్‌ సీరియస్‌గా ఉందని చెప్పిన. అయినా వైద్యం చేయాలన్నారు. ఏర్పాట్లు చేసేలోపే మృతి చెందింది. పిల్లలకు పాలు పట్టిన తరువాత భుజంపై ఎత్తుకోవాలి. లేకుంటే పాలు లంగ్స్‌లోకి వెళ్లి శ్వాస ఆగిపోయే ప్రమాదముంది. మనస్విని విషయంలో ఇదే జరిగింది. 
– గోలి పూర్ణ చందర్, హర్షిత్‌ పిల్లల ఆసుపత్రి వైద్యుడు, మంచిర్యాల 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top