పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?

Nageshwar Reddy Murder Case In YSR  Kadapa - Sakshi

పులివెందుల : పులివెందుల పట్టణంలో సోమవారం రాత్రి సంచలనం సృష్టించిన రంగేశ్వరరెడ్డి హత్య కేసు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు హతుడు రంగేశ్వరరెడ్డి స్వయాన చిన్నాన్న కొడుకు చంద్రశేఖరరెడ్డిగా తెలుస్తోంది. చంద్రశేఖరరెడ్డికి, రంగేశ్వరరెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు, ఇతర లావాదేవీలకు సంబంధించి గొడవలు ఉండేవి. దీనిపై రంగేశ్వరరెడ్డిపై కక్ష పెంచుకుని చంద్రశేఖరరెడ్డి మరికొంతమంది అనుచరులతో కలిసి హత్య చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం రాత్రి చంద్రశేఖరరెడ్డితోపాటు పట్టణంలోని ఇస్లాంపురం ప్రాంతానికి చెందిన ఇమాం బాషా, ఎస్‌బీఐ కాలనీకి చెందిన హరికృష్ణారెడ్డి, నగరిగుట్టకు చెందిన రవిశంకర్‌రెడ్డి, కదిరి పట్టణానికి చెందిన చెక్క డిపో నవీన్‌లు హత్యలో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.

వీరికి ముర్తుజా అనే వ్యక్తి రంగేశ్వరరెడ్డి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి సమాచారం చేర వేసినట్లు సమాచారం. గత 10రోజులనుంచి వీరు రంగేశ్వరరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ప్రతిరోజు రంగేశ్వరరెడ్డి పక్కన ఇతర వ్యక్తులు ఉండటంతో సాధ్యపడలేదు. అయితే సోమవారం రాత్రి 9గంటల ప్రాంతంలో రంగేశ్వరరెడ్డి తన ఇంటి పక్కనే ఉన్న పునాదులపై కూర్చొని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తి నిందితులకు సమాచారం చేరవేశాడు. దీంతో చంద్రశేఖరరెడ్డితోపాటు మిగిలిన నలుగురు నిందితులు అక్కడికి చేరుకుని వేట కొడవళ్లతో విచక్షణారహితంగా రంగేశ్వరరెడ్డిని నరికి హత్య చేశారు.

హత్య జరిగిన విషయం స్థానికుల సమాచారంతో తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులు హత్య చేసి స్కార్పియో వాహనంలో పారిపోతున్నారని గుర్తించిన పోలీసులు వారిని వెంబడించారు. ఎట్టకేలకు లక్కిరెడ్డిపల్లె సమీపంంలోని రామాపురం వద్ద నిందితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పట్టుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రంగేశ్వరరెడ్డి భార్య వెంకటలక్షుమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ : 
సోమవారం రాత్రి హత్యకు గురైన రంగేశ్వరరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను, ఇతర బంధువులను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top