వీడిన హత్యకేసు మిస్టరీ   

Murder Case Solved In Suryapeta - Sakshi

నలుగురి నిందితుల రిమాండ్‌

వివరాలు వెల్లడించిన సీఐ ప్రవీణ్‌కుమార్‌

24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులకు అభినందనలు

ఆత్మకూర్‌(ఎస్‌) (సూర్యాపేట) : ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బొప్పారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన మాధవయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యలో పాలుపంచుకున్న నిందితులను పట్టుకుని రిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రవీణ్‌కుమార్‌ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.బొప్పారం గ్రామానికి చెందిన ఎడ్ల మాధవయ్యను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో కిరాతకంగా నరికి హత్యచేసిన విషయం తెలిసిందే.

ఈ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం కాగా పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. గురువారం గ్రామానికి చెందిన ఎడ్ల జలేందర్, ఎడ్ల జనార్దన్, ఎల్క మధు, ఎర్ర శ్రీకాంత్‌లు అనుమానాస్పదంగా గ్రామంలో తిరుగుతుండడంతో పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఆ హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. గతంలో నిందితుల బంధువులు ఎడ్ల రాందాస్, ఎడ్ల నారాయణలు మృతి చెందారు. వారి మృతికి మాధవయ్య చేతబడే కారణమని భావించి మాధవయ్యపై కక్షపెంచుకున్నారు.

బుధవారం రాత్రి ఇంటి ఆరుబయట నిద్రించడంతో హత్య చేయడానికి పూనుకున్నామని నిందితులు ఒప్పుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. 24 గంటల్లో కేసును చేధించినందుకుగాను ఎస్‌ఐ హరికృష్ణ, సిబ్బందిని అభినందించి ఎస్పీ రివార్డు ప్రకటించినట్టు  విలేకరులకు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ రంగాచార్యులు, సిబ్బంది భగవాన్‌నాయక్, జనార్దన్, అశోక్‌రెడ్డి, అంజయ్య, గౌస్‌షాష తదితరులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top